Contact Us : 9966029714

ఈ సృష్టిలో అణువణువూ చైతన్య రూపమే..మనిషితో సహా. కాకుంటే మనం ఆ సత్యాన్ని మరిచి, ఈ జీవితమే పరమావధిగా బతుకుతున్నాము. ఇంకో రకంగా చెప్పాలంటే, ఆ సత్యం కనబడకుండా మనని కొన్ని పొరలు అడ్డుకుంటున్నాయంతే. ఆ పొరలను చీల్చి, చైతన్యంవైపు అడుగేయించడానికి మనకు కొన్ని వెలుగు రేఖలు అవసరం. సంపూర్ణ చైతన్యంవైపు నడవడానికి ఈ వెలుగురేఖలు దోహదకారులవుతాయి. అలాంటి ఎన్నో వెలుగురేఖల సమాహారమే ఈ వెబ్ సైట్.  

ఎన్నో వ్యయ ప్రయాసలకొర్చి మన పూర్వీకులు ఎంతోమంది, చాలా రకాలైన సాధనసాధనాలను మనకు అందించారు. అప్పటి తరంలో ఆది శంకరుడు, రామానుజాచార్యులు, పతంజలి, నవీన తరంలో వివేకానందుడు, రామకృష్ణుడు, యోగానందుడు, లాహిరి మహాశయుడు, అరవిందుడు, రమణుడు వంటి వారు, సనాతనం మరియు సుసంపన్నం అయిన మార్గాలను స్వయంగా అవలంబించి మన తరానికి అందించారు. ప్రస్తుత తరంలొ కూడా కొంత మంది మహానుభావులు తమ రచనల్లో, ప్రవచనాల్లో వాటిని ప్రతిఫలింపచేస్తున్నారు.  ఇవి తప్పక మనం చైతన్యం అనే గమ్యం దిశగా పయనించేందుకు వెలుగురేఖలుగా తమ వంతు సహాయాన్ని చేస్తాయి. అటువంటివాటన్నింటినీ ఒక దగ్గరకు చేర్చి అందరికీ అందించడం అనే చిన్ని ప్రయత్నమే  ఈ వెబ్ సైట్. 

 

నే పుట్టాను..మనసు బండను

సంకల్ప ఉలితో సామర్థ్యంగా మలిచేందు కోసం

 

నే పుట్టాను..చీకట్లో వెలుగవ్వడంకోసం కాదు

బతుకు ప్రమిదలో ఆశయ దీపం ఎలా వెలుగిస్తుందో చూపడం కోసం

 

నే పుట్టాను..నిరాశలో ఉన్నవారిని బయటకు లాగడంకోసం కాదు

నిరాశల సోపానాలతో విజయశిఖరం వైపు అడుగేయించడంకోసం

 

నే పుట్టాను..ఏఢ్చేవారి కన్నీరు తుడవడం కోసం కాదు

ఏడిస్తే కళ్ళనిండా నీళ్ళతో చూపే కరువవుతుందని చెప్పడం కోసం

 

నే పుట్టాను..ఎందరికో మార్గం నిర్మించడం కోసం కాదు

స్వీయమార్గ నిర్మాణంలో ఉన్న తృప్తి నేర్పడంకోసం

 

నే పుట్టాను..నాతో కలిసి అడుగెయ్యమని చెప్పడంకోసం కాదు

నీదే మొదటి అడుగు అవ్వాలని చెప్పడం కోసం

 

నే పుట్టాను..ఎవ్వరినీ ఉద్ధరించడం కోసం కాదు

ఉధ్ధరించే శక్తి సామర్థ్యాలు నీకున్నాయని చాటడంకోసం

 

నే పుట్టాను..సాధన యఙ్ఞంలో సమిధనయ్యేందుకోసం

నే పుట్టాను..బతుకు కోయిల పాట రాగమయ్యేందుకోసం

నే పుట్టాను..అవేదనాక్షరాలను ఆచరణాలుగా మార్చేందుకోసం

నే పుట్టాను..ప్రపంచపు వెలుగుకు కిరణమయ్యేందుకోసం!!

...(సూరీడు)