Contact Us : 9966029714

శ్రీ భగవద్గీత ముందుమాట

విశ్వ వాజ్ఞ్మయంలో గీత అంత మహత్తర గ్రంథరాజం ఇంకొకటి లేనే లేదు. తక్కిన సాహిత్యమంతా మానవ నిర్మితం. గీత భగవన్నిర్మితం. బోధించినది అవతారమూర్తి. విన్నది అధికార మూర్తి. బోధించినది పరమాత్ముడు. విన్నది మహాత్ముడు. బోధించినది పురుషోత్తముడు. విన్నది నరోత్తముడు. శ్రీకృష్ణార్జునుల దివ్య సంసర్గ జనిత సంభాషణమే గీత. వారిరువురి అట్టి అలౌకిక సంవాదాన్ని జగద్విఖ్యాత రచయిత శ్రీ వేదవ్యాస మునీంద్రుడు చందోబద్ధమొనర్చి అపార కరుణతో ఈ లోకానికి ప్రసాదించాడు.

శ్రీకృష్ణ పరమాత్మ తన జీవితకాలంలో రెండు గానములను చేసాడు. ఒకటి మురళీ గానము, రెండవది గీతాగానము. మురళీ గాన మాధుర్యమును గోపికలు పూర్తిగా ఆస్వాదించిరి. ఆ మురళీగానమెట్టిదో మనకు తెలియదు. అయితే ఏమి? దానిని మించన రెండవ గానము మనవంతుకు వచ్చి పడింది. పాడిన వారికి పాటకు బేధం లేదు. అలాగే శ్రీకృష్ణునకు గీతకు బేధము లేదు.

‘భగవద్గీత’ అనే పేరులోనే ఒక విధమైన విశాల భావం కనిపిస్తుంది. ఎందుకంటే, కృష్ణుడు బోధించినదానిని కృష్ణగీత అని పేర్కొనవలసి ఉండగా, భగవద్గీత అని చెలామణి అవడం దాని జాతిమతవ్యక్త్యతీతమైన స్థాయిని సూచిస్తుంది. ఇది ఒక కాలానికి కాని, ఒక దేశానికి కాని, ఒక మతానికి కాని, ఒక జాతికి కాని సంబంధించినది కాదు.

గీతాజ్ఞానం అనంతం. ప్రతి అక్షరంలో, ప్రతి శ్లోకంలో దైవత్వం తొణికిసలాడుతూ ఉంటుంది. ఒక్కొక్క శ్లోకంలో ఎన్నెన్నో నూతన నూతన అర్థాలు ద్యోతకమవుతుంటాయి. ఎవరి సంస్కారం ఏ విధంగా ఉంటుందో, వారివారికి తగిన అర్థం స్ఫురిస్తుంటుంది.

గీత అనగా గానం చేయబడేది అని అర్థం. గానం ఆనంద సమయాలలోనే సంభవిస్తుంది. కాబట్టి ఆనందమే భగవద్గీత యొక్క ప్రథాన లక్ష్యమని, పరమావధి అని ముముక్షువులు జ్ఞాపకముంచుకోవాలి.

గీతలో ఒక్కొక్క యోగసాధన మొదలు పెట్టినప్పుడు సాధకుడికి కలిగే విఘ్నాలేవి? వాటిని ఎలా పరిష్కరించుకుంటాడు? వంటి వాటన్నింటినీ చక్కగా విశదీకరించారు. అవి ఏవి అనగా

·         దుర్బలత్వాన్ని పారద్రోలాలి

·         మధ్యమార్గం అవలంబించాలి

·         అభ్యాసం వదలకూడదు మరియు వైరాగ్యం చేపట్టాలి

·         శ్రద్ధా విశ్వాసాలు కలిగి ఉండాలి, సంశయం పారద్రోలాలి