Contact Us : 9966029714

ప్రధమ అధ్యాయం – అర్జున విషాద యోగము

దృతరాష్ట్ర ఉవాచ

1.       ధర్మక్షేత్రేకురుక్షేత్రేసమవేతా యుయుత్సవః

మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ |1|

తాత్పర్యం: దృతరాష్ట్రుడు పలికెను, “ ఓ సంజయా! నావారలగు దుర్యోధనాదులు, పాండుపుత్రులు ధర్మరాజాదులు యుద్ధసన్నద్దులై పుణ్య భూమి అయిన కురుక్షేత్రంలో చేరి ఏమి చేసిరి?”

వ్యాఖ్య: ధర్మ శబ్దంతో గీత ప్రారంభమయ్యింది. “ధర్మ” పదాన్ని మొట్టమొదట ప్రయోగించడం ద్వారా వ్యాస మహర్షి గీతకు మంగళాచరణం కావించారు. గీత గ్రంధం యొక్క లక్ష్యం, సారాంశం ఈ మొదటి పదం ద్వారా తేల్చివేయ్యబడింది. దృతరాష్ట్రుని శ్లోకం ‘ధర్మ’  అనే అక్షరాలతో ప్రారంభమయ్యి ‘జయ’ అనే అక్షరాలతో సమాప్తమయ్యింది. ధర్మమే జయించింది అనే అనే ఆర్షవాణిని ప్రథమ శ్లోకమే అద్భుతంగా ఆవిష్కరించింది.

గుడ్డివాడైన దృతరాష్ట్రుడు (మనసు), కురుక్షేత్రంలో తన కుమారులు (కోర్కె మరియు  మరియు పాండురాజు (బుద్ది) కుమారులైన పాండవులు ఏమి చేసారు అని అడుగుతున్నాడు. ఈ ప్రశ్న ఒక ఆధ్యాత్మిక సాధకుడు ప్రతి రోజూ తన నిత్య యుద్ధం గురించి తనకి తాను వేసుకోవలసిన ప్రశ్న. ఒక నిజాయితీ దృక్కోణం ద్వారా అతడు తన ఆధ్యాత్మిక బలాలను మరియూ తన చెడు ప్రవృత్తులనూ బేరీజు వేసుకోవాలి. కురుక్షేత్రం అనే పదం, కృ – అనగా సాధనాస్థలం, క్షేత్రం – అనగా ప్రదేశం, కురుక్షేత్రం అనగా మానవ శరీరమే. ఇది ధర్మక్షేత్రం అని కూడా చెప్పబడింది. అంటే, మన శరీరమే అన్ని ధర్మాలకూ ఆలవాలమైన క్షేత్రం. ఆ క్షేత్రంలో తలపడేవి, బుద్ది సంతానం మరియు మనసు సంతానం.

మన శరీరం ఒక రధమైతే, పురుషుడు రధంలో ఉంటాడు. బుద్ది రధ సారధి. ఇంద్రియాలు గుర్రాలు. మనసు కళ్ళెం. ఎప్పుడూ బుద్ది యొక్క బలం విజయం సాధిస్తేనే, మనసు దాని చేతిలో అంటే, మనసు యొక్క సంతానం – కోర్కెలు మరియూ విషయ వాంచలు అదుపులో ఉంటాయి.

సంజయుడు అనగా – పూర్ణ విజయుడు – అనగా – తనను తాను గెలిచినవాడు. అంటే సంజయుడు అనగా, ఒక ఆత్మ సాధకుడి విషయంలో – స్వీయ పరిశీలన.

వ్యాసుడు, భగవద్గీతను అంతా భూత కాలంలో జరుగుతున్నట్టు రచించాడు. సంజయునకు ఎక్కడ ఉన్నా, ఎక్కడ జరిగేది అయినా చూడగలిగే శక్తి ఉంది. అయినా సరే దృతరాష్ట్రుడు ఏమి చేసిరి? అని జరిగినదాని గురించి అడుగుతున్నాడు. అంటే, మనము ఎప్పుడైనా ఆత్మ పరిశీలన చేసుకోడానికి ఉపయోగ పడేటట్టు రాయబడింది. భగవద్గీత, జరిగిపోయిన లేదా జరుగుతున్న ఒక చారిత్రిక యుద్ధం గురించి చెప్పబడలేదని అర్థం చేసుకోవాలి. ఇది ఒక ఆత్మభావన – శరీరభావన, అంధకారం – తేజస్సు, విచక్షణా బుద్ది – అంధ మనసుకు జరిగే నిత్య నిరంతర యుద్ధం గురించి చెప్పబడింది. ఒక సత్య సాధకుడు, నిత్య నిష్పక్షపాత ఆత్మ పరిశీలన ద్వారా  నిత్యమూ జరుగుతున్న అంతర్యుద్ధం యొక్క పరిణామం తెలుసుకోవాలి.

  

సంజయ ఉవాచ

 దృష్ట్వాతు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా

ఆచార్యముపసంగమ్య రాజా వచనబ్రవీత్  ||2||

తాత్పర్యం: అప్పుడు రాజైన దుర్యోధనుడు వ్యూహంగా ఏర్పాటైన పాండవ సైన్యమును వీక్షించి, అటు తరువాత ద్రోణాచార్యుణ్ని సమీపించి ఇలా పలికాడు.

వ్యాఖ్య:గుడ్డిది అయిన మనసు సంతానమే దుర్యోధనుడు – భౌతిక వాంఛ. ఇక్కడ ద్రోణుడు – సంస్కారానికి ప్రతీక. ఇక్కడ మన మనసులో ఏర్పడే సంస్కారాల గురించి కొంచెం తెలుసుకుందాం.

యోగాభ్యాసంవల్లశరీరంమార్పుకిలోనవుతుందనిమనంగ్రహించాలి. యోగాన్ని అభ్యాసం చేస్తున్నకొద్దీ క్రమంగా నూతన శరీరం ఏర్పడుతుంది. ఎలాగంటే, మనకి కలిగే నూత్న భావం కూడా, మేధలో నాగటిచాలు లాంటి ఒక రేఖను నిర్మిస్తుంది. పూర్వాభ్యాసాలని వదలలేక వాటిని పట్టుకుని వేలాడడానికి కారణం ఇదే. పూర్వాభ్యాసాలని అనుసరించడం సులభం కావడం వల్ల, మానవ స్వభావం పాతదారుల్లోనే వెళ్ళడానికి పూనుకుంటుంది. ఉదాహరణకి, మనసు ఒక సూది లాంటిదని, మేధః పదార్ధం దానిముందున్న ఒక మెత్తని ముద్ద అని భావిస్తే, మనకి కలిగే ప్రతీ భావం మెదడులో నాగటి చాలు లాంటి ఒక మార్గాన్ని నిర్మిస్తుందని చెప్పవచ్చు. దానినే సంస్కారం అంటారు. ప్రతి మనిషికీ బాగా తెలిసిన భావాలని కొన్నింటిని తీసుకుని వాటిని పరస్పరం సమన్వయిస్తూ మాట్లాడితే సుబోధకంగా ఉంటుంది. అయితే కొత్త విషయాలు గ్రహించవలసి వచ్చినప్పుడల్లా, నూత్నమార్గాలని నిర్మాణం చేసుకోవలసి ఉంటుంది. మెదడు నూత్న భావాలని ప్రతిఘటిస్తూ ఉంటుంది. పూర్వాభ్యాసాల ఎడ మనకుండే పట్టుదలలోని రహస్యమిదే. మెదడులో ఈ రేఖలు తక్కువగా ఉండే కొద్దీ, ప్రాణమనే సూది వీటిని తక్కువగా నిర్మించే కొద్దీ మెదడు నూత్న భావాలని సులభంగా గ్రహిస్తుంటుంది. యోగమంటే నూత్న భావాలు, నూత్న ఆశయాలే. కాబట్టి యోగాభ్యాసంలో మొదట దైహిక ప్రాతికూల్యం కనిపించడానికి ఇదే కారణం. అందుకే బాహ్యప్రకృతితో సంబంధముండే విషయాలని మనం ఎక్కువగా ఆమోదిస్తుంటాం. అంతర ప్రకృతితో సంబంధముండే విషయాలని ఎక్కువగా గమనించం.

రెండో శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే, భౌతిక వాంఛకు ఎప్పుడైతే తను వివేచనా శక్తులు(పాండవులు) తో పోరాడి, మానసిక యుద్ధంలో ఓడిపోతానన్న భయం ఏర్పడుతుందో, అప్పుడది, తనను తాను బలపరుచుకోడానికి సంస్కారాన్ని ఆశ్రయిస్తుంది. ఇక్కడ మనం గమనించవలసినది ఏమిటంటే, కౌరవులు, పాండవులూ ఇరువురూ కూడా ద్రోణుడి నుండి విద్య నేర్చుకున్నవారే. అయితే, యుద్ధ సమయంలో మాత్రం, ద్రోణుడు, కౌరవుల పక్షాన నిలిచాడు. సంస్కారం కూడా అంతే.

యుద్ధంలో మన అంతరక్షేత్ర పరిపాలన ఎవరికి అప్పచెప్పాలో నిర్ణయించుకుని, బుద్ది చేతికి అప్పగించేట్టయితే, భగవద్గీత సాధనాలని పాటించడం తప్పని సరి.

భౌతిక వాంఛ ఒక్కదానిని ఓడించడమే పెద్ద శ్రమతో కూడుకున్నదయితే, ఇక దానికి పూర్వ విషయవాంఛల సంస్కారం అనేది తోడయితే, వాటిని ఓడించడం ఇంకా శ్రమ. దానిని బట్టి, మన సాధన ఎంతటి తీవ్ర స్థాయిలో ఉండాలో మనం ఆలోచించుకోవాలి.