Contact Us : 9966029714

భగవద్గీత అంతా ముఖ్యంగా ఒకే సిద్ధాంతం మీద ఆదారపడి వ్యాఖ్యానింపబడింది. ప్రతిమనిషీ వైరాగ్యాన్ని అలవరుచుకుని భౌతిక అజ్ఞానాన్ని వదిలిపెట్టాలి.  అహం మరియు దాని ప్రభావాల వల్ల ఉత్పన్నమయ్యే కోరికలని త్యజించాడంద్వారా, ఆత్మకు మరియు ఇప్పటివరకూ ‘నేను’ అనుకుంటున్న పదార్థానికి మధ్యనున్న తేడా గుర్తించి, సమాధి ద్వారా ఆత్మను పరమాత్మలో విలీనం చేసేందుకు మార్గం కనుగొనగలుగుతాడు. ఈ జ్ఞానం ఏదో ఒక పుస్తకాన్ని చదవడం ద్వారా రాదు. మనజీవితంలో గడిపే ప్రతి క్షణాన్ని యోగ సాధనకి అంకితం చేసి, మనలోనున్న చైతన్యాన్ని, విశ్వచైతన్యమైన భగవంతునిలో విలీనం చేసినప్పుడే సాధ్యమవుతుంది. మనం భగవంతుని నుండి వచ్చాము. తిరిగి అతడినే చేరాలి. ఆత్మ పరమాత్మల సంయోగాన్నే యోగమంటారు.  

నాల్గు వేదాలు, నూటెనిమిది ఉపనిషత్తులు మరియు అన్ని హిందూ దార్శనికతల సారమంతా భగవద్గీతలో ఇమిడి ఉంది. భగవంతుని చేరే దారికి ఉత్తమమైన వెలుగు భగవద్గీతే.

భగవద్గీత ఆత్మ పరమాత్మను చేరేందుకు ఒక నరునికి ప్రభోదింపబడినది. ఈ సత్యాలని భగవంతుడే కృషీవలుడైన సాధకునికి అందించాడు. నిజమైన సాధకుని సందేహాలన్నీ అర్జునుని ద్వారా భగవంతునికి ప్రశ్నల మరియు సమాధానాల రూపంలో నివృత్తి చేయబడ్డాయి.

ఇక్కడ మనం మహాభారతం యొక్క ఆధ్యాత్మిక ప్రతీకాత్మకని తెలుసుకుందాం. మహాభారతంలోని ప్రతి పాత్రకు ఆధ్యాత్మికంగా విశ్లేషణ ఉంది. వ్యాసమహాముని ప్రతి పాత్రనూ ఇప్పటి కాలానుగుణంగా అత్యంత ప్రతిభతో తీర్చిదిద్దాడు.           

శంతనుడు – పరబ్రహ్మ ప్రతీక

గంగ – మహా ప్రకృతి, భీష్ముడు – విశ్వ అహంకారం – మహా ప్రకృతి సంతానం

సత్యవతి – ప్రధమ దేహరూపం పొందిన ప్రకృతి – ఆమె ముగ్గురు సంతానం -  వ్యాసుడు – సాపేక్ష చైతన్యం, చిత్రాంగదుడు – మహా తత్త్వం, విచిత్రవీర్యుడు – దివ్య అహంకారం

అంబిక – సందేహం, అంబాలిక – వివేచనా సామర్ధ్యం    

దృతరాష్ట్రుడు  - మనసు – సందేహం యొక్క సంతానం -  అంధత్వానికి ప్రతీక

పాండురాజు – బుద్ది – వివేచనా సంతానం – వివేకానికి ప్రతీక

గాంధారి – కోరిక శక్తి – మనసుకి భార్య – వీరి సంతానమే దుర్యోధనుడు – కోరిక  మరియు తొంభై తొమ్మిది పుత్రులు – విషయ సుఖాలకు ప్రతీకలు

కుంతి – శాంతము మరియు నిష్పక్షపాతానికి ప్రతీక

మాద్రి – శాంతం పట్ల అనురాగం – వీరిరివురూ బుద్ది భార్యలు.

పాండవులు – బుద్ది సంతానం -    

యుధిష్టురుడు – ఆకాశ తత్త్వం – విశుద్ధ చక్ర ప్రతీక

భీముడు – వాయు తత్త్వం – అనాహత చక్ర ప్రతీక

అర్జునుడు – అగ్ని లేక తేజ తత్త్వం – మణిపూర చక్ర ప్రతీక

నకులుడు – జల తత్త్వం – స్వాదిష్టాన చక్ర ప్రతీక

సహదేవుడు – పృధివి లేక క్షితి తత్త్వం – మూలాధార చక్ర ప్రతీక  

ద్రౌపది – కుండలిని – షట్చక్ర ఆధ్యాత్మిక శక్తులని మేల్కొలిపే ప్రాణ శక్తి

 

ఆత్మ పరమాత్మ నుండి విడివడి ఈ శరీరంగా రూపాంతరం చెందింది. కోర్కె, విషయవాంఛలకు మరియు మనలోనుండే ఆత్మస్పృహకు మధ్య జరిగే నిరంతర యుద్ధమే మహాభారత యుద్ధం. బుద్ది వికాసం యోగం (సంయోగం) చెందడానికి ప్రయత్నిస్తుంటే, కోర్కె మరియు విషయ వాంచలు మనిషిని వెనక్కు లాగుతూ ఉంటాయి. మన శరీరక్షేత్రమే కురుక్షేత్రం. ఈ పోరాటంలో గెలవడమే కైవల్య సాధన. ఇది సాధించవలసిన విజయమే కాక మన హక్కు కూడా.