Contact Us : 9966029714

1.       

1.       అధః యోగానుశాసనం

ఇక యోగ స్వరూప లక్షణాల గురించి చెప్పుకుందాం.

<2.        యోగ చిత్త వృత్తి నిరోధః  

చిత్త వృత్తులను నిరోధించడమే యోగం.                                                                                    

మొత్తం యోగ సూత్రాలన్నీ కూడా దీని మీదే ఆధారపడి ఉన్నాయి. చిత్తం, వృత్తులు అంటే ఏమిటో ముందు మనం తెలుసుకోవాలి. ఉపకరణం, ఇంద్రియం -  ఈ రెంటితో కలిసే మనసు – అనే మూడు విషయాలు అన్ని క్రియల్లో ఉన్నాయి. మనకు కన్నులున్నాయి. అవి తామంత తామే చూడలేవు. మెదడులో నాడీ కేంద్రముంటుంది. దాన్ని తీసివెయ్యండి. కన్నులు అలాగే ఉంటాయి. రెటీనా కూడా చక్కగానే ఉంటుంది. అయినా సరే కన్నులు రూపాలను చూడలేవు. అంటే కన్నులు చూచే ఇంద్రియాలు కావని తేలుతోంది కదా. కన్ను వెలుపలి ఉపకరణం. దీనికి మెదడులో కేంద్రం – మనో నియంత్రణ ఉపయోగపడాలి. వీటికి తోడుగా మరొకటి ఉండాలి. అదే మనసు. ఇంద్రియంతో మనసు సంయోగం చెందాలి. అప్పుడే వస్తువు కనిపిస్తుంది. ఉపకరణం, ఇంద్రియం – ఈ రెంటితో కలిసే మనసు – అనే మూడు విషయాలు ఈ ప్రక్రియలో ఉన్నాయి. వీటి మూలంగా వచ్చే స్పర్శ (వార్త) మనసులోని బుద్ధికి చేరుతుంది. ‘నిశ్చయం’ చేసే పని బుద్దిది. అదే బుద్ది ప్రతిక్రియ. ఈ ప్రతిక్రియను వెన్నంటి అహంభావం ఉంటుంది. ఈ క్రియ – ప్రతిక్రియల సంయోగం పురుషునికి అందుతుంది.                                                                                                                                                                 ఇంద్రియం – మనసు – బుద్ది – అహంభావం -  వీటిని అంతఃకరణ చతుష్టయమంటారు. నిజానికి ఇవన్నీ చిత్తం చేసే వేరు వేరు వ్యాపారాలే. చిత్తంలోని సంకల్పాల వృత్తులే. చిత్తం కూడా ఒక పదార్థమే. అది స్వయంగా చైతన్యవంతం కాదు. చిత్తం వెనుక చైతన్యవంతమైన పురుషుడున్నాడు.

అందుకే అది అలా కనిపిస్తుంది.                                                                                                                       

నిజంగా ప్రపంచమంటే ఏమిటి? బాహ్య విషయాలతో చిత్తం చేసే ప్రతిక్రియరూపమైన సంఘటనలే. చిత్త వృత్తులంటే ఇప్పుడు మనకు తెలిసింది కదా. పురుషుడి చైతన్యమే మనసు ద్వారా వెలువడుతోంది. పురుషుడు మనసును త్యాగం చేస్తే అది నశించి పోతుంది. చిత్తం అంటే అదే. బాహ్య విషయాలతో చిత్తానికి సంయోగం కలగడంతో, వృత్తులనే తరంగాలు చిత్తంలో లేస్తాయి. ఈ వృత్తులే మన ప్రపంచం.                                                                                                                         అలలతో ఉన్న కొలను అడుగు భాగాన్ని మనం చూడలేం. నీరు మలినంగా ఉన్నా, కదులుతున్నా అడుగుభాగం మనకి కనిపించదు. చిత్తమనే సరస్సులో మన నిజ స్వరూపం, ఆత్మయే అడుగు భాగం. చిత్తంలో రేగే వృత్తుల వల్ల మనం మనకి కనిపించం. వృత్తులు నశించినప్పుడే మన నిజ స్వరూపాన్ని కనుగొంటాం. అదే యోగం.

తన సహజ శుద్దావస్థను చేరడానికే మనసు ప్రయత్నిస్తూ ఉంటుంది. అయితే ఇంద్రియాలు మాత్రం మనసును బయటకు లాగుతూ ఉంటాయి. ఇలా మనసు బయటకి వెళ్ళకుండా అరికట్టడమే మనోనిగ్రహం. మనసును నిగ్రహించి, దాన్ని ప్రజ్ఞాన ఘన ఆత్మలో లయం చేయడానికి దాన్ని అంతర్ముఖం చేయడమే యోగానికి మొదటి మెట్టు.   

<3.        తదా ద్రష్టు స్వరూపేవస్థానమ్

అప్పుడు (యోగవస్థలో ఉండే కాలంలో) సాక్షి ఐన పురుషుడు తన స్వరూపంలో నెలకొని ఉంటాడు. అలలన్నీ అణగారిపోయి సరస్సు నిర్మలంగా ఉన్నప్పుడు అడుగు భాగాన్ని స్పష్టంగా చూస్తాం. అలాగే మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు మనం మన స్వరూపాన్ని కనుగొంటాం. ఆ స్థితిలో మనసుతో ఏకం కాము. ఆత్మస్వరూపులమై ఉంటాము.

<4.        వృత్తి సారూప్య మితరత్ర.

ఇతర సమయాల్లో (యోగం) లేని సమయాల్లో పురుషుడు వృత్తులతో సమాన స్వరూపాన్ని పొంది యుంటాడు.

ఎలా అంటే, ఒకరు మనని తిడితే, ఆ తిట్టు వల్ల మన మసులో ఒక వృత్తి కలుగుతుంది. ఆ వృత్తితో మనం ఏకం అయిపోతాం. దాని ఫలితం మనకి దుఖ్ఖం.

<5.        వృత్తయః పంచతయ్యః క్లిష్టా క్లిష్టాః

వృత్తులు ఐదు రకాలు: క్లేశయుక్తాలు, క్లేశరహితాలు అని.

<6.        ప్రమాణ – విపర్యయ – వికల్ప – నిద్రా – స్మృతయః

ఆ ఐదు వృత్తాలు ఇవి: ప్రమాణం, విపర్యం, వికల్పం, నిద్ర, స్మృతి.

<7.       ప్రత్యక్ష అనుమాన ఆగమాః ప్రమాణాని

ప్రమాణ వృత్తి మూడు రకాలు: ప్రత్యక్షం, అనుమానం, ఆగమం(శబ్దం)

ప్రమాణాలు మూడు రకాలు: ప్రత్యక్షం, అనుమానం, ఆగమం అని. మనకు కలిగే అనుభవంలో ఎలాంటి భ్రమకు తావు లేకుంటే అది ప్రత్యక్ష ప్రమాణం. ప్రపంచం ఉంది అనడానికి నాకు ప్రపంచం కనిపించడమే ప్రమాణం. లక్షణం ద్వారా లక్ష్య వస్తువుని గ్రహించడం అనుమాన ప్రమాణం. తత్త్వదర్శులైన యోగుల ప్రత్యక్షానుభవమే ఆగమం.

<8.        విపర్యయో మిథ్యాజ్ఞాన మతద్రూప ప్రతిష్టం

లేని వస్తువు రూపంలో ఆ వస్తువు ఉంది – అనే మిధ్యాజ్ఞానమే విపర్యయ వృత్తి.

ముత్యపు చిప్పను చూసి అది వెండి అని భ్రాంతి పడుతుంటాం. ఇలా ఒక వస్తువుని చూసి, మరొక వస్తువని భ్రమ పడడమే విపర్యయ వృత్తి.

<9.        శబ్దజ్ఞానాను పాతీ వస్తుశూన్యో వికల్పః

శబ్దానికి సంబంధించిన వస్తువు లేకున్నా, శబ్దజ్ఞానంతో అనుసరించే వృత్తి వికల్ప వృత్తి.

ఒక శబ్దం వినిపించింది అనుకుందాం. ఆ శబ్దార్థం ఏమై ఉంటుందా అని కూడా ఆలోచించకుండా, మనం వెంటనే నిర్థారించి వేస్తుంటాం. ఇది చిత్త దౌర్బల్య లక్షణం. దుర్బలత్వం పెరుగుతున్నకొద్దీ, మనో నిగ్రహం క్షీణిస్తూ ఉంటుంది.

కోపం, దుఖ్ఖం – ఇలాంటివి కలిగే సమయాల్లో ఆత్మపరిశీలన చేసుకోండి. ‘ఏదో ఓకే వార్తా వినగానే నాకీ కోపవృత్తి, దుఖ్ఖవృత్తి తప్పకుండా ఎందుకు కలగాలి’ అని ఆలోచించుకోండి.  

10.    అభావ ప్రత్యయాలంబనా వృత్తిర్నిద్రా.

అభావాన్ని ఆశ్రయించి ఉండేదే నిద్రా వృత్తి.

11.    అనుభూతవిషయా సంప్రమోషః స్మృతి:

(ప్రమాణాది వృత్తులతో) అనుభవించిన విషయాలు జ్ఞాపకం రావడమే స్మృతి వృత్తి.

ప్రత్యక్షానుభవం, విపర్యం, వికల్పం, నిద్రా – వీటి ద్వారా స్మృతి కలుగుతుంది.

12.    అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధః

పైన చెప్పిన వృత్తులన్నింటినీ అభ్యాసం, వైరాగ్యం ద్వారా నిరోధించగలం.

అనేక సంస్కారాలు కలిసి ‘అభ్యాసం’ అనేది ఏర్పడుతుంది. ఈ సంస్కారాల ఫలమే మన శీలం. ఎలాంటి సంస్కారాలు మనలో బలవంతమై ఉంటే మనకలాంటి శీలం ఏర్పడుతుంది. ఒక అభ్యాసాన్ని అలవాటు చేసుకోడానికి లేదా వదిలిపెట్టడానికి మనం సమర్ధులమై ఉన్నాం. దుష్ట సంస్కార జనిత దురభ్యాసాలను మంచి అభ్యాసాలతో నిరోధించాలి.

13.    తత్రస్థితౌ యత్నోభ్యాసః

చిత్త వృత్తులను సంపూర్ణంగా నిరోధించడానికి చేసే నిరంతర ప్రయత్నమే అభ్యాసం.

సాధన అంటే ఇదే. చిత్తాన్ని వృత్తి రూపం పొందకుండా చేయడమే.

14.    సతు దీర్ఘకాల నైరంతర్య సత్కారాసేవితో ధృఢ భూమి:

ఆ అభ్యాసాన్ని చాలాకాలం వరకు, ఎడతెగకుండా ఆదరాతిశయంతో కొనసాగిస్తే ఆపుడు స్థిరమైన స్థితి కలుగుతుంది.

15.    దృష్టానుశ్రవిక విషయ వితృష్ణస్య వశీకార సంజ్ఞా వైరాగ్యం

ఇహపరాల్లో అనుభవించదగ్గ విషయాల్లో ఆశ లేని వానికి, విషయాలు తనకి వశమైనాయని తెలియడమే వైరాగ్యం.

మనం రెండు రకాల ప్రేరణలతో పనులు చేస్తుంటాం. ఒకటి, ప్రత్యక్ష స్వానుభవం, రెండు ఇతరుల అనుభవం. వీటి ప్రాబల్యంతో చిత్తంలో రకరకాల వృత్తితరంగాలు లేస్తాయి. ఈ శక్తులతో పోరాడి, మనసును నిగ్రహించే సామర్ధ్యమే వైరాగ్యం. స్వానుభవం వల్లా, పారుల నుభవం వల్లా గుణపాఠాలు గ్రహించి మనసు ఆ విషయాల బారిన పడకుండా చెయ్యడమే వైరాగ్యం. వైరాగ్యాన్ని మించిన మోక్షసాధనం ఇంకోటి లేదు.

16.    తత్పరం పురుష ఖ్యాతేర్గుణ వైతృష్ణ్యం

త్రిగుణాలను కూడా పరిత్యాగం చేసేటటువంటి అత్యంత వైరాగ్యం పురుషుని (నిజస్వభావాన్ని) చూపుతుంది.

చిత్తానికి మూడు గుణాలుంటాయి. సాత్వికం, రాజసం, తామసం అని. పశువుల్లో, పశుతుల్యుల్లో తామసం విశేషంగా ఉంటుంది. ఈ స్థితి హానికరం. విషయ భోగాలను, అధికారాన్ని కోరడం రాజసం. ఇలాంటి చిత్త స్థితి ‘శక్తిమంతుడనై అందరిపై అధికారాన్ని చూపిస్తాను’ అన్న ప్రేరణకు గురిచేస్తుంది. శాంతం,ప్రసన్నం – సాత్వికస్థితి లక్షణం. సృష్టిజాతమంతా ఈ మూడు స్థితిల సంయోగ, పునస్సంయోగాల వల్ల ఉత్పన్నమవుతున్నది. పురుషుడు, ప్రకృతికి అతీతుడుగా, నిత్యశుద్ధబుద్ద ముక్తుడై ఉంటాడు. ప్రకృతిలో మనకి కనిపించేదంతా ప్రకృతిలోని పురుషుని ప్రతిబింబమే కానీ, మరొకటి కాదు. ప్రకృతి స్వయంగా జడం. మనసు అనే తత్త్వం కూడా ప్రకృతి తత్త్వం లోనిదేనని ,మనం గ్రహించాలి.

తరవాతి సూత్రాల్లో యోగ పరమావధి అయిన సమాధి స్థితులను వివరిస్తారు.   

17.     వితర్క విచారానందాస్మితాను గమాత్ సంప్రజ్ఞాతః

వితర్కం, విచారణం (యుక్తాయుక్త విచక్షణ) – ఆనందం, ఆస్మితం అనే స్థితులతో కూడుకున్న సమాధిస్థితి – సంప్రజ్ఞాత సమాధి. సమాధి స్థితి రెండు రకాలు. సంప్రజ్ఞాత, అసంప్రజ్ఞాత. సంప్రజ్ఞాత సమాధి మళ్ళీ నాలుగు రకాలు.

మొదటిది – సవితర్క సమాధి. ఇందులో మనసు ఒకానొక విషయాన్ని, తదితర విషయాల నుండి వేరు చేసి, దాన్నే పదే పదేధ్యానిస్తూ ఉంటుంది.

రెండవది – నిర్వితర్క సమాధి. దేశ కాలాల నుండి పృధివ్యాది భూతాలని వేరు చేసి, వాటిని వాస్తవ రూపంలో చింతన చేస్తే దానిని నిర్వితర్కమంటారు.

మూడవది నిర్విచార సమాధి – పైన చెప్పిన ధ్యానంలో దేశ కాలాలని తొలగించి, సూక్ష్మ భూతాలను వాటి వాస్తవ రూపంలో చింతన చేస్తే ఆ ధ్యానాన్ని నిర్విచార సమాధి అంటారు.

నాల్గవది – ఆనంద సమాధి. స్థూల, సూక్ష్మభూతాలను కూడా వదిలివేసి, అంతరింద్రియ మనసు ధ్యేయమై, అంతఃకరణం రజస్తమోగుణరహితమై ఉందని భావిస్తే దానిని ఆనంద సమాధి అంటారు.

18.    విరామ ప్రత్యయాభ్యాస పూర్వః సంస్కార శేషోన్య

చిత్తవృత్తులనన్నింటినీ నిరాకరించే, నిరంతర అభ్యాసం ద్వారా లభించే, అవ్యక్త సంస్కారాలు మాత్రమే చిత్తంలో శేషించి ఉండే మరొక సమాధి స్థితి ఉంది. ఇదే అతీంద్రియ జ్ఞానావస్థ అయిన అసంప్రజ్ఞాత సమాధి. దీని వల్ల మోక్షం లభిస్తుంది.

అభ్యాస వైరాగ్యాలను అవలంబించకుండా, మనసును సంకల్ప శూన్యం చేసేవాడు మూర్ఖుడు. మనసును వృత్తి శూన్యం చేయాలంటే ఉత్కృష్ట బలం, అత్యున్నత నిగ్రహం కావాలి.

19.    భవ – ప్రత్యయో – విదేహ – ప్రకృతిలయానామ్ 

(తీవ్ర వైరాగ్యం లేకుంటే ఈ సమాధి) విదేహు (దేవత)లకూ, ప్రకృతి లయులకూ పునర్జన్మ హేతువవుతుంది.

20.    శ్రద్ధా – వీర్య – స్మృతి – సమాధి – ప్రజ్ఞా – పూర్వక ఇతిరేషామ్    

ఇతరులకు (విదేహ ప్రకృతిలయులు కానివారికి) శ్రద్ధ, వీర్య, స్మృతి, ఏకాగ్రత, ప్రజ్ఞ అనే వాటి వల్ల ఈ సమాధి కలుగుతుంది. ఇలాంటి వారు ముక్తులవుతారు.

21.    తీవ్ర సంవేగానామాసన్నః    

తీవ్ర కార్య దీక్ష ఉండేవారికి త్వరగా ఫలం లభిస్తుంది.

22.    మృదు మధ్యాదిమాత్రత్వాత్తతోపి విశేషః     

మందం, సామాన్యం, తీవ్రం అనే సాధనా బేధాలను బట్టి, యోగులకు సిద్ధిలో తారతమ్యాలుంటాయి.

23.    ఈశ్వర ప్రణిధానాద్వా

ఈశ్వర ప్రణిధానం (కర్మ ఫలాలను ఈశ్వరునికి అర్పించడం) వల్ల కానీ (యోగం సిద్ధిస్తుంది)    

24.    క్లేశ కర్మ విపాకాశయై రపరామృస్టః పురుషవిశేష ఈశ్వరః

క్లేశం, కర్మ, కర్మఫలం, కామం అనే వాటితో బాధితుడు కాని ఒకానొక పురుషుడిని ఈశ్వరుడంటారు.

25.    తత్ర నిరతిశయం సర్వజ్ఞబీజమ్      

ఇతరుల్లో బీజామాత్రంగా ఉండే సర్వజ్ఞత్వం ఈశ్వరునిలో అనంతంగా ఉంటుంది. మనిషిలో జ్ఞానం బీజామాత్రంగా ఉంది. అయితే ఈ కించిజ్ఞత్వం వల్లే సర్వజ్ఞత్వం ఉందని అనుకోవలసి వస్తుంది. ఇలా మన మనస్తత్త్వం వల్లే అనంత జ్ఞానం ఉందని మనకి తెలుస్తోంది. యోగులు ఈ అనంత జ్ఞానాన్నే భగవంతుడంటారు.  

26.    స పూర్వేషామపి గురుహ్ కాలేనాన వచ్చేధాత్         

అతడు త్రికాలాబాధాతీతుడు కావడం వల్ల సనాతనాచార్యులకి కూడా గురువై ఉన్నాడు.

యోగులు రెండు విచిత్ర సిద్ధాంతాలని ప్రతిపాదిస్తారు. పరిమిత వస్తువుని భావించే సమయంలో, మనసు అపరిమితమైన దానిని భావించవలసి ఉంటుంది. ఈ రెండూ కూడా ఒకే మనసుకి కనిపించే విషయంలో రెండు భాగాలు అవడం వల్ల, రెంటిలో ఒకటి యదార్ధమైతే రెండవది కూడా యదార్ధమై ఉండాలని యోగుల మొదటి సిద్ధాంతం. గురువు లేనిదే జ్ఞానం కలగదని యోగుల రెండవ సిద్ధాంతం. ఆధునిక తాత్త్వికులు చెప్పే విధంగా, క్రమంగా వికసించే తత్త్వం మనిషిలో ఉందనడం వాస్తవం. సమస్త జ్ఞానం కూడా మనిషిలోనే ఉంది. అయితే ఇది ప్రదర్శితం కావడానికి కొన్ని పరిస్థితులు కావాలి. మానవ గురువులైనా, దేవతా గురువులైనా అంటా దేశ కాలబధ్దులే. కాబట్టి త్రికాలాబాధాతీతుడైన గురువు ఒకరున్నారని మనం అంగీకరించక తప్పదు. అఖండజ్ఞానస్వరూపుడైన ఆ పరమ గురువే భగవంతుడు.

27.    తస్య వాచకః ప్రణవః      

ఓంకారమే అతడి నామధేయం.   

ఓంకారాన్ని అంత ప్రధానంగా పరిగణించడానికి కారణమేమిటి? భగవంతుడనే భావం వందల కొలదీ పదాలతో సంబంధం కలిగి ఉంది. ప్రతీ పదం కూడా భగవంతుడికి ఒక సంజ్ఞగా ఉంది. వీటినన్నింటినీ సమీకరిస్తూ వీటి భావాలన్నిటినీ తెలిపే ఉత్తమోత్తమ సంజ్ఞ, ఏ శబ్దం నుండి ఇతర శబ్దాలనీ వ్యక్తమవుతున్నాయో – అలా అన్నీ శబ్దాలకు మూలమైనది ప్రణవం లేదా ఓంకారం.  

28.    తజ్జప స్తదర్ధ భావనమ్

ఈ ఓంకారాన్ని జపించడం, దాని అర్థాన్ని భావించడం మోక్ష సాధనం.

ఓంకార జపం వల్ల, దాని అర్ధభావన వల్ల మనసులోనే సత్సాంగత్యాన్ని నిర్మించుకొనవచ్చు. తత్త్వాన్ని చింతిద్దాం, చింతితాంశాన్ని ధ్యానిద్దాం. తత్త్వ దర్శనానికి ఇదే దారి.

29.    తతః ప్రత్యక్చేతనాధిగమోప్యంతరాయాభావశ్చ

దాని (ఓంకార జపం) వల్ల అంతర్దృష్టి (జ్ఞానం), విఘ్ననాశనం కలుగుతాయి.

ఇప్పుడు యోగంలో విఘ్నాలేవో చూద్దాం.

30.    వ్యాదిస్త్యాన సంశయ ప్రమాథాలస్యా విరతి భ్రాంతి దర్శనాం

లబ్ద – భూమికత్వానవస్థితత్వాని చిత్తవిక్షేపాస్తేన్తరాయః

రోగం – మానసిక జడత్వం – సంశయం – అజాగ్రత్త – మత్తత – అతృప్తి – భ్రమ – చిత్త స్థైర్యం నిలువకుండుట అనేవి యోగానికి అంతరాయాలు.  

31.    దుఃఖ దౌర్మనస్యాంగమే జయత్వశ్వాస ప్రశ్వాసా విక్షేపసహభువః

దుఃఖం – చిత్తక్షోభం – శరీరంలో కంపనం – క్రమరహితశ్వాస – అన్నవి చిత్త విక్షేపానికి సహకారులు.

చిత్త – ఏకాగ్రతను అభ్యాసం చేసినప్పుడల్లా మనశ్శరీరాలకు పూర్తీ విశ్రాంతి కలుగుతుంది. సక్రమంగా సాధన చేయకపోవడం వల్ల కానీ, తగినంత మనోనిగ్రహం లేకపోవడంవల్ల కానీ పై బాధలు కలుగుతుంటాయి. ప్రణవ జపం వల్ల కానీ, భగవంతుని శరణు పొందడంవల్ల కానీ, మనోస్థైర్యం కలగడమే కాక నూత్న శక్తి సామర్థ్యాలు కూడా లభిస్తాయి.

32.    తత్ప్రతిషేదార్ధమేక తత్త్వాభ్యాసః

చిత్త చాంచల్యాన్ని నివారించడానికి ఏకతత్త్వాన్ని అభ్యసించాలి.

క్రమం తప్పక కొంతకాలం వరకూ మనసునొకే విషయంలో నిలిపి ధ్యేయాకారం పొందేలా చెయ్యాలి. అలా చేస్తే పై విఘ్నాలన్నీ తొలగిపోతాయి.

33.    మైత్రీ కరుణాముదితోపేక్షాణం సుఖదుఃఖ పుణ్యాపుణ్య విషయాణాం భావనా తశ్చిత్త ప్రసాదనమ్   

సుఖదుఃఖ పుణ్యపాప విషయాల గూర్చి మైత్రీ (స్నేహం), కరుణ (దయ), ముదిత (సంతోషం), ఉపేక్షా (ఉదాసీనత) అనే ఈ వృత్తులను క్రమానుసారంగా భావన చేస్తే చిత్త చాంచల్యం నశించి ప్రసన్నత కలుగుతుంది.

విషయాల ఎడ మనం నాలుగు రకాల మనోభావాలను అవలంబించాలి. అందరితో స్నేహం కలిగి వర్తించాలి. దుస్థితిలో ఉన్నవారి యందు కరుణ, సుఖించే వారియందు సంతోషం, దుర్మార్గుల ఎడ ఉదాసీనత కలిగి ఉండడం మంచిది. ఒకరు మనకు చెడు చేస్తే వెంటనే మనం ప్రతీకారం చెయ్యబోతాం. మనోనిగ్రహ సామర్ధ్యం తక్కువగా ఉందన్న విషయాన్ని ప్రతీకారం తెలియచేస్తుంది. ద్వేషాన్ని లేదా క్రోధాన్ని నిగ్రహించినప్పుడల్లా మనకెంతో మేలు చేసే సత్త్వశక్తి – వీర్యం – ప్రాణశక్తి చేకూరతాయి. ఇలాంటి సత్త్వశక్తి నుండే మానసిక శక్తులు వెలువడతాయి.  

34.    ప్రచ్చర్దన విదారణాభ్యాం వా ప్రాణస్య  

ప్రాణాన్ని (శ్వాసను) విడవడం, నిలపడం – ప్రాణాయామం ద్వారా కూడా మనః ప్రసన్నత కలుగుతుంది.

ప్రాణాన్ని వదలడం, నిలపడమే ప్రాణాయామం. యోగ దర్శనానికి పిత లాంటి పతంజలి మహర్షి ప్రాణాయామం గురించి ప్రత్యేక పద్ధతులని సూచించడు. ఇతర యోగులు మాత్రం ప్రాణాయామం గురించి అనేక విషయాలు కనుగొన్నారు. దాన్ని ఒక శాస్త్రంగా నిర్మించారు. పతంజలి మహర్షి ప్రాణాయామాన్ని యోగ సాధనలో ఒక సాధనగా మాత్రమే పరిగణిస్తాడు. కాలక్రమంలో ప్రాణాయామం ఒక శాస్త్రంగా రూపు దాల్చింది. శ్వాస నియమాన్ని అభ్యాసం చేస్తే, శరీరంలోని వివిధ చలనాలని, నాడీవాహినులని స్వాధీనం చేసుకోవచ్చు. ఇంద్రియాలకి బలాన్నిచ్చేది ప్రాణం. ఆ ప్రాణాన్ని ప్రయత్నపూర్వకంగా నిగ్రహించడం వల్ల వాటిని అటూ ఇటూ పరుగులెత్తించే దోషరాసులు భస్మమయిపోతాయి.

ఇక్కడ కొన్ని ముఖ్య విషయాలని తెలుసుకుందాం.

మన శరీరంలో ఇడా – పింగళ – సుషుమ్నా అనే మూడు నాడులున్నాయి. వెన్నెముకకి కుడివైపు పింగళ, ఎడమవైపు ఇడా, మధ్యలో సుషుమ్నా నాడులుంటాయి. సుషుమ్న బోలుగా ఉండే కాలువలా ఉంటుంది. ఇడా పింగళ నాడులు ప్రతి మనిషిలో క్రియాశీలంగా ఉండే నాడులు. వీటి ద్వారానే శరీర వ్యాపారాలన్నీ జరుగుతుంటాయి. సాధ్యావస్థలో జనులందరిలో సుషుమ్నా నాడి ఉంది. కానీ యోగుల్లో మాత్రమే సుషుమ్న క్రియాశీలమై ఉంటుంది. యోగాభ్యాసం వల్ల శరీరం మార్పుకి లోనవుతుందని మనం గ్రహించాలి. యోగాన్ని అభ్యాసం చేస్తున్నకొద్దీ క్రమంగా నూతన శరీరం ఏర్పడుతుంది. ఎలాగంటే, మనకి కలిగే నూత్న భావం కూడా, మేధలో నాగటిచాలు లాంటి ఒక రేఖను నిర్మిస్తుంది. పూర్వాభ్యాసాలని వదలలేక వాటిని పట్టుకుని వేలాడడానికి కారణం ఇదే. పూర్వాభ్యాసాలని అనుసరించడం సులభం కావడం వల్ల, మానవ స్వభావం పాతదారుల్లోనే వెళ్ళడానికి పూనుకుంటుంది. ఉదాహరణకి, మనసు ఒక సూది లాంటిదని, మేధః పదార్ధం దానిముందున్న ఒక మెత్తని ముద్ద అని భావిస్తే, మనకి కలిగే ప్రతీ భావం మెదడులో నాగటి చాలు లాంటి ఒక మార్గాన్ని నిర్మిస్తుందని చెప్పవచ్చు. మెదడులో శ్వేత ధాతువు ఈ మార్గాన్ని ప్రత్యేకంగా ఉంచడం కోసం దానిపై ఒక పొరగా ఏర్పడి, ఆ మార్గాన్ని మూసివేస్తుంది. ప్రతి మనిషికీ బాగా తెలిసిన భావాలని కొన్నింటిని తీసుకుని వాటిని పరస్పరం సమన్వయిస్తూ మాట్లాడితే సుబోధకంగా ఉంటుంది. అయితే కొత్త విషయాలు గ్రహించవలసి వచ్చినప్పుడల్లా, నూత్నమార్గాలని నిర్మాణం చేసుకోవలసి ఉంటుంది. మెదడు నూత్న భావాలని ప్రతిఘటిస్తూ ఉంటుంది. పూర్వాభ్యాసాల ఎడ మనకుండే పట్టుదలలోని రహస్యమిదే. మెదడులో ఈ రేఖలు తక్కువగా ఉండే కొద్దీ, ప్రాణమనే సూది వీటిని తక్కువగా నిర్మించే కొద్దీ మెదడు నూత్న భావాలని సులభంగా గ్రహిస్తుంటుంది. యోగమంటే నూత్న భావాలు, నూత్న ఆశయాలే. కాబట్టి యోగాభ్యాసంలో మొదట దైహిక ప్రాతికూల్యం కనిపించడానికి ఇదే కారణం. అందుకే బాహ్యప్రకృతితో సంబంధముండే విషయాలని మనం ఎక్కువగా ఆమోదిస్తుంటాం. అంతర ప్రకృతితో సంబంధముండే విషయాలని ఎక్కువగా గమనించం.

35.    విషయవతీ వా ప్రవృత్తిరుత్పన్నా మనసః స్థితి నిబందినీ

అప్రాకృత విషయానుభవంవల్ల కలిగే ఏ మనః ప్రవృత్తి అయినా చిత్త స్థైర్యాన్ని కలుగచేస్తుంది.

36.    విశోకా వా జ్యోతిష్మతీ    

సర్వ దుఃఖాతీత దివ్య జ్యోతిని ధ్యానిస్తే చిత్త స్థైర్యం కలుగుతుంది.

ఇదొక రకమైన ధారణ. హృదయ వక్షస్థలాల మధ్య అష్టదళ కమలాన్ని, దాని దళాలు కింది వైపుకు తిరిగి ఉన్నట్టు భావించాలి. సుషుమ్న దాని నాళం అని భావించాలి. ఊపిరి పీల్చి వదలడం ద్వారా ఆ కమల దళాలు పై వైపుకు తిరుగుతున్నట్టు, దానిలో దేదీప్యమానంగా వెలిగే జ్యోతి ఉన్నట్టు భావించాలి. ఆ జ్యోతిపై చిత్తాన్ని నిలిపి ధ్యానించాలి.

37.    వీతరాగ విషయం వా చిత్తమ్

విషయవాసనలను త్యాగం చేసిన చిత్తాన్ని ధ్యానించడం వల్ల చిత్త స్థైర్యం ఏర్పడుతుంది. పరమ పూజ్యుడు, నిస్సంగుడు అని భావించే ఒక యోగి రాగరహిత హృదయాన్ని ధ్యానించడం వల్ల మనసు ప్రశాంతతని పొందుతుంది.

38.    స్వప్న నిద్రా జ్ఞాన లంబనం వా

స్వప్నంలో లేదా నిద్రలో కలిగే జ్ఞానాన్ని భావించడంవల్ల మనః ప్రసన్నత కలుగుతుంది.

ఒక్కొక్కసారి స్వప్నంలో దేవతా దర్శనం కలిగినట్లు, ఒక దివ్య అనుభవం పొందినట్లు భావన కలుగుతుంది. ఆ సమయంలో కలిగిన దివ్యానుభూతిని మననం చేసుకోవడం వల్ల, ఆ అనుభవంపై ధారణ చెయ్యడంవల్ల మనసుకి స్థిరత్వం కలుగుతుంది.

39.    యథాభిమత ధ్యానా ద్వా

మనకభిమతమైన ఒక సద్భావనని కానీ, ఒక మంచి విషయాన్ని కానీ ధ్యానించడం వల్ల స్థిర చిత్తత కలుగుతుంది.

40.    పరమాణు పరమ మహాత్త్వాంతోస్య వశీకారః

ఇలా ధ్యానించే యోగి చిత్తానికి పరమాణువు మొదలు అనంతత్త్వం వరకూ ధ్యాన వశీకారమై ఉంటాయి. మనో వృత్తులు క్రమంగా క్షీణిస్తాయి.

41.    క్షీణ వృత్తే రభిజ్యాత స్యేవ మణేర్గృహీతృ

క్షీణవృత్తులు కల యోగి చిత్తం ఆత్మ లేక పురుషునిలో వర్ణయుక్త వస్తువులు ఎదుట ఉన్న స్ఫటికం వలే తాదాత్మ్యం పొందుతుంది. ద్యానస్థిత యోగి పువ్వు ముందున్న స్ఫటికం వంటివాడు. పువ్వు ఎర్రగా ఉంటే, దాని దగ్గర ఉండే స్ఫటికం కూడా ఎర్రగా కనిపిస్తుంది. సమాపత్తి అనగా సాక్షాత్కారము. సాక్షాత్కారము పొందడమే సంప్రజ్ఞాత సమాధి ఫలం.

42.    తత్ర శబ్దార్ధజ్ఞాన వికల్పైహి సంకీర్ణా సవితర్కా సమపత్తిః

శబ్దం, అర్థం, జ్ఞానం అనే మూడు కలిసి ఉన్నప్పుడు సవితర్క సమాధి అంటారు.

శబ్దమంటే స్పందన, అర్థం అంటే దాన్ని మెదడుకి తీసుకెళ్ళే నాడులు, జ్ఞానమంటే మనసులో కలిగే ప్రక్రియ. సవితర్క సమాధిలో విషయి – విషయాల ద్వైతం భాసిస్తూ ఉంటుంది. బాహ్య స్పందన శబ్దాన్ని జ్ఞాన నాడులు లోనికి తీసుకెళ్ళినప్పుడు అర్థం అవుతుంది. చిత్తంలో ప్రతిక్రియాత్మక వృత్తి కలుగుతుంది. అది జ్ఞానం. ఇప్పటివరకూ చెప్పుకున్న ధ్యానాల్లో ఇలాంటి మిశ్రిత విషయాన్ని ధ్యేయంగా గ్రహిస్తున్నాం.

ఈ శబ్దార్థజ్ఞానాలంటే ఏమిటో తెలుసుకుందాం. చిత్తం సరసులాంటిదైతే, శబ్దం అనే స్పందనం, ఈ సరస్సులో లేచే అల వంటిది. ఇప్పుడు మనం ఆవు అనే శబ్దం వినగానే (ఆ శబ్దం చెవుల్లో ప్రవేశించగానే) చిత్తంలో ఒక వృత్తి కలుగుతుంది. ఈ వృత్తే ఆవు అనే భావం. దీన్ని ఆవు శబ్దపు అర్థమని అంటాం. బాహ్యాంతర స్పందనాలకి ప్రతిక్రియారూపంలో చిత్తంలో చూచే వృత్తే ఆవు. శబ్దం లేనిదే వృత్తి ఎప్పుడూ కలగదు. ఆవుని గూర్చి భావిస్తున్నాం తప్ప ఆవు అనే శబ్దం వినడం లేదు. అంటే మనం మనసులో ఆవు అనే శబ్దాన్ని నెమ్మదిగా ఉచ్చరిస్తున్నామన్నమాట. దానితో ఆవు అనే వృత్తి కలుగుతుంది. శబ్దమంతరించగానే వృత్తి కూడా లయిస్తుంది. మిగిలింది చిత్తంలో కలిగే ప్రతిక్రియాఫలమే. అదే జ్ఞానం.   

 43.    స్మృతి పరిశుద్దౌ స్వరూప శూన్యేవార్ధమాత్ర నిర్బాసా నిర్వితర్కా   

స్మృతి పరిశుద్ధమై గుణరహితమై ద్యేయపు అర్థాన్ని మాత్రమే భాసింపచేస్తున్నప్పుడునిర్వితర్క సమాధి కలుగుతుంది. నిర్వితర్క ధ్యానాన్ని చిరకాలం అభ్యాసం చేస్తే శబ్దార్ధజ్ఞానాలని వేర్వేరుగా గ్రహించగలం. దీన్నే నిర్వికల్పసమాధి అంటారు.

44.    ఏతయైవ సవిచారా నిర్విచారాచ సూక్ష్మవిషయం వ్యాఖ్యాతా

సూక్ష్మ విషయాలతో కూడిన సవిచార నిర్విచార సమాధులను గురించి తెలియచేస్తున్నారు.       

45.    సూక్ష్మవిషయ త్వం చా లింగపర్యావసానమ్

సూక్ష్మ విషయాలు ప్రధానతత్త్వం (ఆలింగం) తో అంతమవుతున్నాయి.

పంచభూతాలు, వాటితో నిర్మించబడ్డవన్నీ స్థూలవిషయాలు. తన్మాత్రలు అనే పరమాణువులతో ప్రారంభమయ్యేవి సూక్ష్మ విషయాలు. పురుషుడు తప్ప మిగిలిన తత్త్వాలన్నీ అంటే – ఇంద్రియాలు, మనసు, అహంకారం, చిత్తం, సత్త్వరజస్తమాల సామ్యావస్థ అయిన ప్రధానం, ప్రకృతి – అన్నీ కూడా సూక్ష్మ విషయాల్లోకి చేరుతాయి.          

46.    తా ఏవ సబీజః సమాధిః

సవితర్క, నిర్వితర్క, సవిచార, నిర్విచార సమాధులు బీజసమాధులై ఉంటాయి. ఇవి పూర్వకర్మ బీజాలను నిర్మూలించలేవు. కాబట్టి వీటి వల్ల మోక్షం సిద్ధించదు. కానీ వీటి వల్ల కలిగే ప్రయోజనాలను తరువాతి సూత్రాలలో తెలియజేస్తున్నారు.

47.    నిర్విచార వైశారద్యేధ్యాత్మ ప్రసాదః

నిర్విచార సమాధి పరిశుద్ధం అవడం వల్ల ఆధ్యాత్మ ప్రసాదం అంటే స్థిర చిత్తత కలుగుతుంది.

48.    ఋతం భరా తత్ర ప్రజ్ఞా

నిర్విచార సమాధిలో పొందే ప్రజ్ఞ సత్య పరిపూర్ణమైనది. ఈ స్థితిని అందుకొన్న యోగి పొందే ప్రజ్ఞే ఋతంభర ప్రజ్ఞ.

49.    శ్రుతానుమాన ప్రజ్ఞాభ్యామన్య విషయా విశేషార్దత్వాత్

ప్రత్యక్షానుభవాలతో లభించే జ్ఞానం సామాన్య విషయాలను తెలుపుతుంది.

ఈ సమాధి వల్ల కలిగే ప్రజ్ఞ, ప్రత్యక్షానుమానాలతో గ్రహించలేని విషయాలను ప్రకాశింపచేస్తుంది. వేదాలనన్నింటినీ పఠించినా మనకెట్టి సాక్షాత్కారం కలగదు. అయితే వేదవిదులని అనుసరించి సాధన చెయ్యడం వల్ల అవాక్ మానసగోచర అఖండసచ్చిదానంద స్థితి పొందగలం అని ఈ సూత్ర అభిప్రాయం. హేతువాదం మరియు తర్కజ్ఞానంతో అతీంద్రియ జ్ఞానం కలగదని మనకి తెలుసు. ఆత్మ, పరమాత్మల వంటి తత్త్వాలు బాహ్యేంద్రియగోచరాలు కాజాలవు. ఇంద్రియజన్య జ్ఞానాన్ని దాటితే తప్ప సాక్షాత్కారం అనేది ఎప్పటికీ కలగదు. తార్కికజ్ఞానాతీతుడు కాదగ్గ శక్తి మనిషికి ఉంది. యోగాభ్యాసంతో ఈ శక్తి వికసించగానే మనిషి తార్కిక జ్ఞానాతీతుడై అతీంద్రియ విషయాలను ప్రత్యక్షంగా అవలోకిస్తాడు.

50.    తజ్జఃసంస్కారోన్య సంస్కార ప్రతిబంధీ

ఈ సమాధి వల్ల కలిగే సంస్కారం ఇతర సంస్కారాలన్నింటినీ నిరోధిస్తుంది.

చిత్తాన్ని ఏకాగ్రం చేయటానికి ప్రారంభించగానే చిత్త వృత్తులు విజృంభిస్తాయి. కానీ పైన చెప్పిన సాధన వలన ఏకాగ్రత పెరిగి, తద్ద్వారా కలిగే సంస్కారాలు ఇతర సంస్కారాలని నిరోధించగలిగేంత ప్రబలంగా ఉంటాయి.

51.    తస్యాపి నిరోధే సర్వనిరోధాన్నిర్బీజః సమాధిః

ఇతర సంస్కారాలను నిరోధించే ఈ సంస్కారాన్ని కూడా నిరోధించడం వల్ల సర్వం నిరోధితమై నిర్భీజసమాధి ఏర్పడుతుంది.

పామరుడు తన శరీరమే ఆత్మ లేక పురుషుడు అనుకుంటాడు, పండితుడు అయినా తన మనసే ఆత్మ అనుకుంటాడు. ఇద్దరూ భ్రమలోనే ఉన్నారు. వివిధ చిత్త వృత్తులు పురుషుని ఆవరించి ఉండడం వల్ల, ఈ ఆవరణం ద్వారా పురుషుని ప్రతిబింబమే మనకు ఛాయామాత్రంగా గోచరిస్తుంది. కాబట్టి కోపం అనే చిత్తవృత్తి కలిగిన వెంటనే “నాకు కోపం వచ్చింది” అంటూ, పురుషునికి కోపం వచ్చినట్టు అనుకుంటాం. ప్రేమ అనే చిత్త వృత్తి కలిగితే, ఆ ప్రతిబింబాన్ని పురుషునిలో చూసి “మాకు ప్రేమ ఉంది” అని చెబుతాం. చిత్తం అనే సరస్సును వృత్తులు అనే తరంగాలు ఆవరిన్చిఉన్నంతకాలం పురుషుడిని దర్శించాలేం. కాబట్టి మొదటగా చిత్త వృత్తుల స్వభావ స్థితుల గురించి, తర్వాత చిత్త వృత్తులని నిరోధించే ఉపాయాలని గురించి, అగ్నిని అగ్నియే దహిస్తుంది – అన్న రీతిలో ఒక్క వృత్తియే, ఇతర వృత్తులనన్నింటినీ నిరోధించేదాకా ఆ వృత్తిని ప్రబలం చేసే విధానాన్ని పతంజలి బోధించాడు. ఒకటే చిత్త వృత్తి మిగిలి ఉన్నప్పుడు దానిని నిరోధించడం సులభం. అప్పుడు కలిగే సమాధినే నిర్భీజసమాధి అంటారు. ఇలా సర్వవృత్తి నిరోధం సిద్ధించగానే, అద్వితీయ – కేవల – జననమరణరహిత – నిత్య – నిర్వికార – స్వయంజ్యోతి అయిన పురుషుడు సహజ వైభవంతో ప్రకాశిస్తాడు.