Contact Us : 9966029714

యోగసూత్రాలు గురించి చెప్పే ముందు, ఒక ముఖ్య విషయం తెలుసుకోవడం అవశ్యం. యోగ మత సిద్ధాంతాలన్నీ దీని పైనే ఆధారపడి ఉన్నాయి. నామరూపాత్మకమైన మన ఈ సోపాధిక స్థితి వెనుక నామరూపాతీత నిరుపాధిక స్థితి ఉంది. అదే మన ద్వైత ప్రపంచంగా వ్యక్తమవుతోంది. మనమంతా మళ్ళీ ఆ నిరుపాధికస్థితి పొందడానికే ఆ మార్గంలోనే వెళుతున్నాం.

ఒక వ్యక్తిలో పుట్టిన రాగ ద్వేషాలు తిరిగి అతన్నే చేరుకుంటాయి. కాబట్టి మనం ఎవరినీ ద్వేషించవద్దు. ఎందుకంటే కాలాంతరంలో ఆ ద్వేషం మరల మనల్నే చేరుకుంటుంది.

ప్రతి ఆకారం కూడా అణు నిర్మితమే. చివరికి ఆ ఆకారం మరల అణువులుగా మారిపోతుంది. ఒక్క నియమమే వేరు వేరు చోట్ల వేరు వేరుగా ఉండదు. అన్ని కాలాల్లో, అన్ని అవస్థల్లో కూడా ఒకే విధంగా ఉండేదే నియమం. బాహ్య ప్రకృతిలోనే కాదు, ‘నియమం’ అంతర ప్రకృతిలో కూడా ఇలాగే ఉంటుంది. మనసు దేన్లో పుట్టిందో తిరిగి దాన్లోనే లయిస్తుంది. మనం కోరినా, కోరకున్నా సరే ఈశ్వరుడు, పరబ్రహ్మం అనే మన సహజ స్థితిని మనం పొందక తప్పదు.

మరి మనిషి చివరికి భగవంతుడ్ని చేరడం ఉన్నత అవస్థా? కాదా? అని ప్రశ్నిస్తారేమో! యోగులు అది ఉన్నత అవస్థే అంటారు. ఆ ఉన్నత స్థితి నుండి కల్గిన పతనమే ఇప్పటి మానుష స్థితి అని వారు చెబుతారు. మొదట మనిషి భగవంతుడి నుండి వస్తాడు. మధ్యలో మనుష స్థితి పొందుతాడు. చివర మరల భగవంతుడిలో కలుస్తాడు అని ద్వైత మతం చెబుతుంది. మనిషి నిజానికి భగవంతుడే. చివరికి అతడు భగవంతుడే అయిపోతాడు అని అద్వైతం అంటుంది.  

తర్కం, హేతువాదం కన్నా మించిన మానసిక అవస్థలున్నాయి. బోధను దాటివేయడమే ఆధ్యాత్మిక జీవితానికి మొదటి మెట్టు. భావనను, బుద్ధిని, తర్కాన్ని పూర్తిగా దాటాలి. అప్పుడే ఆధాత్మిక సాధన మొదలవుతుంది. అదే యదార్థ జీవితారంభం. మనం సామాన్యంగా జీవితం అని పేర్కొంటున్నది, ఆధ్యాత్మిక జీవితానికి బీజావస్థ.

పతంజలి యోగాసూత్రాలు మొత్తం 4 పాదాలుగా విభజించబాడ్డాయి. అవి వరుసగా

సమాధి పాదం, సాధన పాదం, విభూతి పాదం, కైవల్య పాదం. వాటిలో వరుసగా 51, 55, 56 & 33 సూత్రాలుంటాయి. మొత్తం 195 సూత్రాలు.