Contact Us : 9966029714

ఈశావాశ్యోపనిషత్తు

ప్రకాశానికిఅవతల

 

ఒకింత అలోచించగల ఎవరికైనా తెలిసిన సత్యం - మనం అఙ్ఞానంలో ఉంటున్నామనేది. మనకి బాహ్య ప్రకృతికి సంబంధించిన అనేక విషయాలు తెలిసి ఉండవచ్చు. అయితే ఇది నిజమైన ఙ్ఞానం కాదు. మనలను గురించిన ఙ్ఞానమే నిజమైన ఙ్ఞానం. సాధనల ఫలితంగా మనకు జ్యోతిర్మయ దర్శనం కలుగుతుంది. అఙ్ఞానాంధకారం తొలగుతుంది. అయితే ఆ దర్శనంతోనే పయనం ఆగిపోదు. అంతిమ సత్యం అన్ని ద్వందాలకూ అతీతమైనది. అనుదే ఆ తేజస్సుకు అవతల ఏమున్నదో తెలుసుకుంటేనే పయనం గమ్యాన్ని చేరుకున్నట్టు. ఆ తేజస్సుకు అవతల తననే చూస్తున్నట్టు ఈ ఋషి చెబుతున్నాడు. చరమ స్థితి అనుభూతి ఇది.

ఈశావాస్య ఉపనిషత్తులో మనకు గోచరించేది ఈశ విద్య. 'ఈశావాస్య మిదగ్మ్ సర్వం' అనె మంత్రంతో ప్రారంభం అవడం వల్ల దీనికా పేరు వచ్చింది. 18 మంత్రాలతో కూడుకున్న చిన్న ఉపనిషత్తు ఇది. శుక్లయజుర్వేదంలో వాజసనేయ సమ్హితలో ఈ ఉపనిషత్తు పొందుపరచబడి ఉంది. తత్యన్ అథర్వణుడనే మహర్షి తన పుత్రునకు ఇది ఉపదేశించినట్టు సమాచారం.

శాంతిపాఠం

ఓంపూర్ణమదఃపూర్ణమిదంపూర్ణాత్పూర్ణముదచ్యతే|

పూర్ణస్యపూర్ణమాదాయపూర్ణమేవావశిష్యతే||

ఓంశాంతిఃశాంతిఃశాంతిః

అది (భగవంతుడు) పూర్ణం. ఇది (లోకం) కూడాపరిపూర్ణమైనది. పూర్ణమైనభగవంతునినుండిపూర్ణమైనలోకంఉద్భవించింది. పూర్ణంనుండిపూర్ణంతీసివేసినాపూర్ణమేమిగిలిఉంది.

మనంఎందరినోప్రేమిస్తాం. సంపూర్ణంగాప్రేమనువర్షిస్తాం. అయినంతమాత్రానమనదగ్గరప్రేమతగ్గిపోయిందనిచెప్పలేం. మనవద్దప్రేమసంపూర్ణంగాఉంటూనేఅందరికీసంపూర్ణమైనప్రేమనుపంచిపెట్టగలం. భగవంతునియొక్కపరిపూర్ణతలోకాలఉద్భవంవల్లతగ్గిపోదు. భగవంతునినుండిఉద్భవించినలోకంకూడాపూర్ణమైనభగవద్స్వరూపం.

 

ఓం ఈశావాస్య మిదగ్మ్ సర్వం యత్కించ జగత్యాం జగత్ |

తేనత్యక్తేన భుంజీథాః మాగృథః కస్యస్విధ్ధనమ్మ్ ||            1

మార్పుచెందే ఈ లోకంలో అంతా భగవంతునిచే ఆవరింపబడి ఉంది. అలాంటి త్యాగంచేత పోషణ చేసుకో. ఎవరి ధనాన్ని మాత్రం ఆశించకు.

ఇక్కడ మనం అర్థం చేసుకోవలసిన ముఖ్య విషయం - ఈ లోకం అంతా మార్పు చెందేది, అంటే అంతా అనిత్యం. అయిన గుర్తుంచుకోవలసినది ఏమిటంటే - ఇది అంతా కూడా భగవంతునిచే ఆవరింపబడి ఉంది. ఆ సత్యాన్ని గ్రహించాలి. అన్నిట్లోనూ భగవంతుడిని చూడడం నేర్వాలి. దేనినీ వదిలివేయవద్దు. అన్నిట్లోనూ భగవంతుడు సరిసమానంగా నిండి ఉన్నాడు. సర్వత్రా ఉన్నది అతడే. సమస్తమూ ఆయనకు చెందినదే. అందువల్ల, ఇదంతా మనది కాదు, అతడిదే అన్న త్యాగంతో లోకాన్ని అనుభవవించాలి.

 

కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేచ్చతగ్మ్ సమాః |

ఏవం త్వయి నాన్యథేతోస్తిన కర్మ లిప్యతే నరే ||              2

ఈ లోకంలో విహిత కర్మలను నిర్వహిస్తూ మాత్రమే  నూరు సంవత్సరాలు జీవించాలని ఆశించాలి. మానవునకు ఇది తప్ప వేరే దారి లేదు. అలాంటఫ్ఫుడు కర్మ అంటదు.

కర్మలు నిర్వహించకుండా ఎవరూ జీవించలేరు. ఫలితం ఏదైనా తప్పదు. అది మనలను బంధిస్తుంది. ఒక సంస్కారం ఏర్పరుస్తుంది. మళ్ళీ ఆ పనిని చేసేలా ప్రేరేపిస్తుంది. ఇది జననమరణ పరంపరకు దారి తీస్తుంది. అందుకే, ఈ లోకమంతా భగవంతునిదికి చెందినదిగా గ్రహించి, అతడే మన పర్యావసానాలకు బాధ్యుడని భావిస్తే, ప్రతిఫలం మనను తాకదు. ఫలితం తాకని పని ఒక ఆత్మ సాధనగా పరిణమిస్తుంది.

 

అసుర్యా నామతే అంధేన తమసావృతాః |

తాగంస్తే ప్రేత్యాభిగచ్ఛంతియేకే చాత్మహనో జనాః ||         3

రాక్షసుల లోకాలు కటిక చీకటీతో ఆవరించబడి ఉంటాయి. ఆత్మహంతకులు మరణానంతరం వాటిని పొందుతారు.

ఆత్మకు నాశనం లేదు. ఇక్కడ ఆత్మహంతకులు అంటే - ఆత్మను నశింపచేదిగా భావిస్తూ నేరం చేసేవారని అర్థం. అటువంటివారు మరణానంతరం కటికచీకటి నిండిన లోకాలు పొందుతారు. అంటే - కటికచీకటి లాంటి దుఖఃజన్మలు పొందుతారు. అందుకే ఆత్మను అన్వేషిస్తూ ఆంతరిక పురోగతిని కాంక్షించాలి.

 

అనేజదేకం మనసో జవీయో నైనద్దేవా ఆప్నువన్ పూర్వమర్షత్ |

తధ్ధావతోన్యానత్యేతి తిష్ఠత్తస్మిన్నపో మాతరిశ్వా దధాతి ||   4

ఆత్మ ఒకటే చలనం లేనిదైనా మనసు కంటే వేగవంతమైనది. ఇంద్రియాలు దానిని గ్రహించలేవు. స్థిరంగా ఉన్నదైనా చలించే అన్నిటి కన్నా వేగవంతంగా వెళ్ళగలదు. సకల ప్రాణకోటి కార్యకలాపాలకు ప్రాణశక్తి సమకూరుస్తోంది.

ఆత్మ సర్వత్రా వ్యాపించి ఉన్నది కనుకనే చలనం లేనిది. మనసు ఎంత వేగంగా పయనించినప్పటికీ, అక్కడ అప్పటికే ఆత్మ లేక భగవంతుడు ఉంటాడు. అంకనే మనసు కన్నా వేగవంతమైనదనీ, అన్నిటికన్నా ముందుండేదనీ చెప్పబడింది. ఇంద్రియాల ద్వారా ఆత్మను గ్రహించలేము. దివ్యచక్షువులు మాత్రమే ఆ పని చేయగలవు. చలించే దానికి దేనికైనా సరే అచలమైనది ఒకటి ఆధారం కావాలి. అలాగే లోకంలో చలనాలన్నింటికీ కారణమైన ప్రాణచలనానికి ఆధారంగా ఉండేదే ఆత్మ.

 

తదేజతి తన్నైజతి తద్దూరే తద్వంతికే |

తదంతరస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాహ్యతః ||          5

అది (ఆత్మ) చలిస్తుంది, చలించదు. దూరంగా ఉంది. దగ్గరగా కూడా ఉంది. అన్నింటి లోపలా ఉంది. వెలుపలా ఉంది.

ఇంద్రియాల ద్వారా గ్రహించలేని దానిని ఇంద్రియాల ద్వారా వివరించడానికి ప్రయత్నించే యత్నం వల్ల వైరుధ్య భావాలు  ఉన్నట్టుగా అనిపిస్తోంది. సమస్త వ్యాపారాలకీ ఆధారభూతం ఆత్మ. అందుకనే చలిస్తుంది అని పేర్కొన్నారు. కానీ, ఆత్మ సర్వవ్యాపకం. అందుకనే చలించవలసిన అవసరం లేదు. చలించదు. మన ప్రతిఒక్కరిలొనూ ఆత్మా ఉంది. అందువల్ల సమీపంగా ఉంది. కానీ, మనం దానిని గ్రహించలేని స్థితిలో ఉన్నాము. అందువల్ల దూరంలో ఉంది. అది భగవంతుని స్థితిలో సర్వవ్యాప్తిగా ఉండడం వల్ల, అన్నింటిలోనూ ఉంది మరియూ అన్నింటి వెలుపలా ఉంది.

 

యస్తు సర్వాణి భూతాన్యాత్మన్యేవాను పశ్యతి |

సర్వభూతేషు చాత్మానం తతోన విజుగుప్సతే ||              6

ఎవరైతే సర్వజీవరాసులనూ తన ఆత్మలో మరియూ సర్వజీవులలో ఆత్మనూ దర్శిస్తాడో, ఆ కారణం చేత అతడు ఎవరినీ ద్వేషించడు.

  

యస్మిన్ సర్వాణి భూతాన్యాత్మైవాభూద్విజానతః |

తత్రకో మోహః కః శోక ఏకత్వమనుపశ్యత ||                    7

ఆత్మయే అన్ని జీవరాసులుగా అయినదని తెలుసుకుని ఏకత్వ భావన ఏర్పరుచుకున్న వ్యక్తికి మోహమేమిటి? దుఖఃమేమిటి?

అన్నీ ఒకటే అయినప్పుడు ఇక మోహము, దక్కలేదన్న దుఃఖము ఏముంటుంది. మనకి కానవచ్చే దృశ్య ప్రపంచం విభిన్నంగా ఉండడానికి కారణం బాహ్య ప్రపంచం కాదు. మన భావన యొక్క మార్పే అందుకు కారణం. కొందరిని మాత్రమే ప్రేమించే మనం, మన అనుభూతిని విస్తృతి పరుచుకుంటే, క్రమక్రమంగా అందరినీ ప్రేమిస్తాం. మార్పు చుట్టూ ఉండేవారిలో రాలేదు. మన ప్రేమే విస్తృతి చెందింది. ఆత్మానుభూతిలో భావన ఎల్లలు స్పృశించి, మనమే సర్వత్రమని గ్రహిస్తాం. అందువల్ల సుఖ దుఃఖాలు ఏవీ బాధించవు. అన్ని ద్వంద్వాలకూ అతీతులమవుతాం.    

 

స పర్యాగాచ్చుక్ర మకాయమవ్రణమస్నావిరగ్మ్ శుద్ధమాపాపవిధ్ధం  |

కవిర్మనీషి పరిభూః స్వయం భూ ర్యాథాతథ్యతోర్థాన్ వ్వదధాచ్ఛాశ్వతీభ్యః సమాభ్యః ||  8    

అన్నింటి అంతరార్థాలనూ కాంచేవాడు, మనస్సును వశం చేసుకున్నవాడు, యావత్ జ్ఞానాన్నీ తనలో పదిల పరుచుకున్నవాడు, ఎవరికీ చెందనివాడు, సంపదల యదార్ధ నైజం గ్రహించినవాడు, శరీరంలేని, పరిపూర్ణమైన, విభాగాలు లేని, స్వచ్చమైన, పాపంలేని దానిని (భగవంతుని) చేరుకుంటాడు.

అన్నింటి అంతరార్థాలనూ చూడగలిగేవాడు -  ప్రతి దృశ్యానికీ వెనుక భగవంతుని గాంచుతాడు. బుద్ది ద్వారా మనసుని వశం చేసుకోగలుగుతాడు. ఆత్మానుభూతి తక్కిన జ్ఞానాలకన్నా ఉన్నతమైనదిగా పేర్కొనబడినందున, అతడు యావత్ జ్ఞానాన్నీ పొందినట్టే. అతడు ఆత్మానుభూతిని (భగవంతుని) అంటిపెట్టుకుని ఉంటాడే కానీ, దేనికీ ఎవ్వరికీ చెందనివాడు. అతడు అంతర్, బాహ్య వస్తువుల నిజ నైజాన్ని గ్రహించి, ఏవి భగవన్మార్గానికి తోడ్పడుతాయో, ఏవి ఆటంకాలో గ్రహిస్తాడు. అటువంటివాడు భగవంతుని చేరుకుంటాడు.

 

అంధం తమః ప్రవిశంతి యేవిద్యాముపాసతే |

తతో భూయ ఇవ తే తమో య ఉ విద్యాయాగ్మ్ రతాః ||   9

అవిద్యని ఉపాసించేవారు అంధకారంలో మునిగిపోతారు. విద్యను ఆనందించేవారు అంతకన్నా చీకటిలో మునుగుతారు.

 

అన్యదేవాహు ర్విద్యయా అన్యదాహురవిద్యయా |

ఇతి శుశ్రమ ధీరాణాం యేన స్తద్విచచక్షిరే ||               10

విద్య వల్ల ఒక ఫలితం లభిస్తుందనీ, అవిద్య వల్ల మరో ఫలితం లభిస్తుందనీ మాకు ఇది వివరించిన మాహాత్ముల నుండి మేము ఇలా విన్నాము.

 

విద్యాం చావిద్యాం చ య స్తద్వేదో భయగ్మ్ సహ |

అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయా మృతమశ్నుతే ||  11

అవిద్యనూ, విద్యనూ రెంటినీ తెలుసుకున్నవాడు అవిద్య ద్వారా మృత్యువుని జయించి, విద్య ద్వారా అమరత్వాన్ని పొందుతాడు.

విద్య అంటే భగవద్పర కార్యం. వేదాధ్యయనం సైతం భగవంతుని ఉద్దేశించి చేయకుంటే అవిద్యగానే పేర్కొనబడుతుంది. తపస్సైనా, దానమైనా సరే పేరు ప్రతిష్టల గురించి చేస్తే దుఖఃహేతువవుతుంది. అవి అప్పుడు అవిద్యలవుతాయి. చీకట్లో మునుగుతాడు అంటే, అజ్ఞానానికి వశమై జన్మజన్మలకి గురి అవుతాడు. అందుచేత తపస్సు, ధ్యానం వంటి ఏ కార్యమైనా సరే  భగవంతుని ఆకాంక్షించి చేస్తే మరణానికి కారణమైన కర్మల ఫలితాల నుండి విడివడి (మృత్యువుని జయించి), అమరత్వాన్ని అంటే – భగవంతుడిని పొందుతాడు.

 

అంధం తమః ప్రవిశంతి యే సంభూతిముపాసతే |

తతో భూయ ఇవ తే తమో య ఉ సంభూత్యాగ్మ్ రతాః ||   12

ఎవరు ప్రకృతిని ఉపాసిస్తారో వారు గాడాంధకారంలో ప్రవేశిస్తారు. హిరణ్యగర్భుని లేదా కార్యబ్రహ్మను ఉపాసించేవారు ఇంకా అంధకారంలో ప్రవేశిస్తారు.

 

అన్యదేవాహుః సంభవాదన్యదాహురసంభవాత్ |

ఇతి శుశ్రుమ ధీరాణాం యే నస్తద్విచక్షిరే ||                13

హిరణ్యగర్భుని లేదా కార్యబ్రహ్మను ఉపాసించడం వలన ఒక ఫలితం, ప్రకృతిని ఉపాసించడం వలన మరొక ఫలితం  లభిస్తుందని మాకు వివరించిన మహాత్ముల నుండి మేము ఇలా విన్నాము.

కార్యబ్రహ్మను ఉపాసించేవారికి కొన్ని సిద్దులు కలుగుతాయి. ప్రకృతిని ఉపాసించేవారు ప్రకృతి లయని పొందుతారు. అచేతనమైన దానిని ధ్యానించడం వలన మోక్షం సిద్ధించదు.

 

సంభూతిం చ వినాశం చ యస్తద్వేదోభయగ్మ్ సహ |

వినాశేన మృత్యుం తీర్త్వా సంభూత్యా మృతమశ్నుతే||      14

కార్యబ్రహ్మనూ, అవ్యక్తప్రకృతినీ రెంటినీ ఉపాసించేవాడు కార్యబ్రహ్మ ఉపాసన ద్వారా మృత్యువుని జయించి, అవ్యక్త ప్రకృతి ఉపాసన ద్వారా అమరత్వాన్ని పొందుతాడు.

ఇక్కడ కార్యబ్రహ్మ మరియు అవ్యక్త ప్రకృతి యొక్క సముచ్చయోపాసన గురించి చెప్పబడింది. సముచ్చయోపాసనలో కార్యబ్రహ్మోపాసన వలన మృత్యువు అంటే శక్తులు, కోర్కెలు, దుర్గుణాలను జయించి, అవ్యక్తప్రకృతి ఉపాసన వలన అమృతత్వం అంటే అమరత్వాన్ని పొందుతాడు.

 

హిరణ్మయేన పాత్రేణసత్యస్యాపిహితం ముఖం |

తత్ త్వం పూషన్నపావృణు సత్యధర్మాయ దృష్టయే ||      15

సత్యం యొక్క వదనం స్వర్ణమయమైన తెరచే కప్పబడిఉంది. ఓ సూర్యదేవా! సత్యనిష్టుడనైన నాకు తత్త్వదర్శనార్ధం తెరను తొలగించుము.   

తేజస్సుకు అవతలకి వెళ్ళడానికి ప్రయత్నమే ఈశవిద్య. భగవంతుడిని కాంక్షించే వ్యక్తీ ప్రార్థన, ‘నన్ను అంధకారం నుండి వెలుగుకి తోడ్కొని వెళ్ళు’ అని ఉంటుంది. కానీ, సత్యం అనేది చీకటి – వెలుగు లాంటి అనేక ద్వంద్వాలకు అతీతమైనది. అందుకనే తేజస్సుని దాటి వెళ్ళాలి. దానికోసం భగవంతుడిని ప్రార్థించే మంత్రమే ఇది. ‘సత్యనిష్టుడనైన నేను’ అని తన అర్హతను తెలియచేయడం బట్టి, భగవంతుడిని నమ్ముకుని, అతడిని తేజోమయ స్వరూపంగా దర్శించిన వ్యక్తీ చేసే ప్రార్థన ఇది.

 

పూషన్నేకర్షే యమ సూర్య ప్రాజాపత్య వ్యూహ రశ్మీన్ సమూహ |

తేజో తత్ తే రూపం కల్యాణతమం తత్ తే పశ్యామి |

యో సావసౌ పురుషః సో హమస్మి ||                              16

ఓ సూర్యదేవా! ఏకైక ఋషీ! అందరినీ పరిపాలించేవాడా! ప్రజాపతి కుమారుడా! నీ కిరణాలను ఉపసంహరించుకో. నీ దివ్య తేజస్సును కుదించుకో. నీ దివ్య రూపాన్ని నేను దర్శించాలి. ఆ సూర్యునిలో నేలోని ఉన్నది నేనే. నీయందలి పురుషుడను నేనే.

తేజస్సుకు అవతల ఉన్నది నేనే అని దర్శనం పొందడం చరమ సత్యం. ఎన్నో ప్రయత్నాల మరియు ఆత్మసాధనల అనంతరం భగవద్దర్శనం తరువాత కూడా స్వయంగా తననే దర్శించడమే చరమ సత్యం.

 

వాయురనిలమమృతమథేదం భస్మాంతగ్మ్ శరీరం |

ఓం క్రతో స్మర కృతగ్మ్ స్మర క్రతో స్మర కృతగ్మ్ స్మర ||         17    

ఈ శరీరం కాలి బూడిద అయిపోతుంది. శరీరం నుండి వెలువడే ప్రాణం సర్వవ్యాపి అయిన నిత్యగత ప్రాణంలో లీనమైపోతుంది. ఓ మనసా! చింతన చెయ్యి. చేసిన వాటిని చింతన చెయ్యి.

ఎవరైనా సరే, భగవంతుడిని కాంక్షించే వారైనా సరే, సామాన్య జీవితం గడుపుతున్న వారైనా సరే, మన అనిత్యాన్ని మనసుకు ఎప్పుడూ ఎత్తి చూపుతుండాలి. ఎవరి శరీరమైనా సరే, బూడిద అవ్వక తప్పదు. ఇంద్రియాలు నిర్వీర్యం అయిపోతాయి. ఈ సత్యాన్ని చింతన చేస్తే ఒక నూత్న దృక్పధం అలవడుతుంది. ఇప్పటివరకూ ఆలస్యమైనా, కనీసం ఇప్పటినుండైనా, ఉన్నత జీవితానికి ఇలాంటి చింతన ప్రేరణ కలిగిస్తుంది.

 

అగ్నే నయ సుపథా రాయే అస్మాన్ విశ్వాని దేవ వయునాని విద్వాన్ |

యుయోధ్యస్మజ్జుహురాణమేనో భూయిష్టాం తే నమ ఉక్తిం విధేమ ||   18

ఓ అగ్నిదేవా! మా సకల కార్యాలను నువ్వు ఎరుగుదువు. ఫలితాన్ని అనుభవించడానికి మమ్మల్ని అనుభవ మార్గంలో తోడ్కొని వెళ్ళు. మా నుండి ఘోరమైన తప్పులను నిర్మూలింపుము. నీకు అనేక నమస్కారములు.

అగ్నిని కనుగొన్న తరువాత, దానిని సర్వవ్యాపి, సర్వ శక్తిమంతుడు అయిన భగవంతుని చిహ్నంగా ఆరాధించడం వేదాలలో కానవస్తుంది. ఆ విధంగా అగ్నిని భగవంతుని చిహ్నంగా భావించి ప్రార్థించిన మంత్రం ఇది.  పనులు ఏవైనా ఫలితాలు అనుభవించవలసిందే. ఓ భగవంతుడా! ఇక కొత్త పనులు చేసి ఫలితాలు రాకుండా, మాలో ఉన్న తప్పులను మేము చేసే సాధన ద్వారా నిర్మూలింపచేయమని ఈ ఉపదేశ భావం అయ్యుండవచ్చు.  

 

ఓంపూర్ణమదఃపూర్ణమిదంపూర్ణాత్పూర్ణముదచ్యతే|

పూర్ణస్యపూర్ణమాదాయపూర్ణమేవావశిష్యతే||

ఓంశాంతిఃశాంతిఃశాంతిః

భగవంతుడుపరిపూర్ణం. లోకంకూడాపరిపూర్ణమైనది. పూర్ణమైనభగవంతునినుండిపూర్ణమైనలోకంఉద్భవించింది. పూర్ణంనుండిపూర్ణంతీసివేసినాపూర్ణమేమిగిలిఉంది.

ఓంశాంతిఃశాంతిఃశాంతిః