Contact Us : 9966029714

||ఎక్స్టింక్ట్ స్పీషీస్||

 జాగ్రత్తగా పరికించి చూస్తే

ప్రపంచం నుండి వెలివేయబడి

అతిత్వరలో అంతరించబోయే జాతిని నేను...

ద్విముఖ పదఘట్టనల కింద

నలిగిపోతున్న అమృతధార వాక్యాల

అంతర్ముఖ మూలాన్ని నేను

అర్షడ్వర్గ వేళ్ళను తెగనరికే

ఆయుధసంపత్తి సమకూర్చుకోగల

సామర్థ్యమున్న ప్రాణిని నేను

 

బయటెందుకు చూస్తావని

అంతా లోనేనని

 

ఎలుగెత్తి చాటి అరవ

 

ఛీత్కారాల పాదాల కింద నలిగి

 

ఆక్రొశిస్తున్న జాతిని నేను

 

 

 

ప్రేమకు

 

జాతి, లింగ, మత, ప్రాణి బేధాలు లేవని

 

ద్వేషానికి విరుగుడు మంత్రం అదొక్కటేననీ

 

సంపూర్ణమైన నమ్మకానికి

 

ప్రాణ దాతను నేను

 

 

 

నీచే ప్రేమించబడడానికి

 

నీకు బంధువో లేక స్నేహితుడో

 

కావడం ఒక అర్హతా అని ప్రశ్నించగల

 

దమ్మున్న గుండె వెనకున్న

 

ప్రాణాన్ని నేను

 

 

 

అమిత భావాల సతమతాన్ని

 

దూరం చేసేందుకు

 

పారదర్శక హృదయ సూత్ర పఠనమే

 

మార్గమని చెప్తూ

 

నన్నే నాకెత్తి చూపగల జీవుల

 

స్వార్ధపు వానలో తడుస్తూ 

 

ఆరిపోబోతున్న వెలుగును నేను

 

 

 

గతమెంత నలుపున్నా

 

భవిష్యత్ వెలుగు నింపుకునే

 

సామర్థ్యం నీకుందని నిరూపించే ప్రయత్నంలో

 

ఎవరో వస్తారు ఏదో చేస్తారన్న

 

నమ్మకాల మధ్య నలిగి

 

ప్రాణం విడవబోతున్న నిజాన్ని నేను 

 

 

 

ఇప్పుడు కాకున్నా...కొన్నేళ్ళ తర్వాతైనా

 

నా వీడ్కోలుకు సమయమాసన్నమయ్యిందన్న

 

సత్యాన్ని గ్రహించి

 

మీ ముందుకొచ్చి ప్రాణభిక్ష పెట్టమని

 

సిగ్గొదిలి అడుక్కోడానికైనా సిధ్ధపడ్డ

 

మీ నేను  

 

 

 

మనిషిగానే పుట్టి

 

మనిషిగానే జీవించాలన్న

 

సామాన్య అలోచనలున్న

 

మీలా కాని...మీకేమాత్రం సరిపోని

 

మామూలు మనిషిని నేను!!!

 

 

 

||జీవజాలం నవ్వింది||

 

 

 

 

 

కాకి మనసారా నవ్వింది

 

నిజంగా ఈ రోజు...

 

ఒక కాకి రాలి పడితే

 

వంద కాకులు చుట్టూ చేరినా

 

ఒక మనిషి కింద పడ్డప్పుడు

 

మనకి వెక్కిరింత నవ్వు పొంగిన రోజు

 

 

 

పిల్లి పగలబడి నవ్వింది

 

పిల్లి మనిషిచ్చిన పాలు తాగి

 

మనిషి కళ్ళు పోవాలని అది కోరుకుంటుందని

 

వదంతులు వ్యాప్తి చెందినందుకు కాదు

 

సాయం చేసిన మనిషిని

 

ఇంకో మనిషి కిందకి తోయాలని

 

ప్రయత్నించిన రోజు

 

 

 

పాముకు చేతులుంటే పొట్ట పట్టుకు నవ్వేది

 

అది విషం కక్కి మనని చంపుతుందని

 

మనం దానిని చంపుతున్నందుకు కాదు

 

నిలువెల్లా విషం నింపుకుని

 

ప్రతి మాటలో అది కక్కే మనిషి నుండి

 

ఆ మాట విన్నందుకు

 

 

 

పులి దొర్లి దొర్లి నవ్వింది

 

పొద్దుట వేటను దాచుకుని

 

మళ్ళీ తింటుందని మనం కధలు

 

చెప్పుకున్నందుకు కాదు

 

దాని తాపత్రయాన్ని గురించి

 

కధలు చెప్పుకునే మనిషి

 

జీవితం అనుక్షణం

 

తాపత్రయంతో బతికే తీరు గురించి

 

 

 

కుక్క రోజూ నవ్వుతూనే ఉంది

 

విశ్వాసానికి మారుపేరని

 

దాన్ని మనం చూపుతున్నందుకు కాదు

 

ప్రేమ గురించి ఎన్నో కబుర్లు చెప్తూ

 

ప్రేమకు విశ్వాసం ఒక రూపమేమని

 

ప్రేమ అనంతమని తెలియని

 

మన అజ్ఞానం గురించి

 

 

 

 

 

 

 

||మాతృక||

 

 

 

 

 

నేనున్నాను...

 

భూమ్యాకాశాలకి మధ్య గీత గీయలేని చోట

 

వెలుగునీడలన్న పదాలు పుట్టని ముందు చోట

 

సర్వకాలాలు ఏకీకృతమై కాలం ఘనీభవించిన చోట

 

భావాలకి పదాలు లేని, అసలు భావాలే అవసరం లేని చోట...

 

 

 

నా దృష్టికి అన్ని మార్గాలు సాధానాకృతులై

 

ముగింపు మంగళాచరణాలతో నాలో కలుస్తున్నాయి

 

నా అంతర్వీనులకి సప్తస్వరాలూ మిళితమై

 

ఏకనాద ఓంకారమై మురిపిస్తున్నాయి

 

పరమసుఖ పవనమో లేక సర్వభరితమో అయిన స్పర్శ

 

అంతఃచర్మేంద్రియాన్ని తాకి పరవశింపచేస్తోంది

 

పరమానంద సువాసనాభరితగంధం

 

నాసికాగ్రాన నిలిచి పరంజ్యోతిలా మెరుస్తోంది

 

పూర్ణామృత రుచి ఏకధారయై

 

జిహ్వలో అంతర్వాహినిలా ప్రవహిస్తూ సాగిపోతోంది

 

  

 

 

 

ఈస్థి నా ఒకప్పటిస్థితి అని

 

ఆరంభానికి ఎప్పటి ముందరదో అని

 

నాలో నాకే తెలుస్తూ

 

మనోఙ్ఞానఫలక చిత్తడినేలపై

 

ముద్రలామిగిలి నన్ను నాకు ఎప్పుడూ

 

పరిచేయం చేయ ప్రయత్నిస్తోంది

 

 

 

బాహ్యేంద్రియాలతో సంబంధంలేని

 

అంతఃకరణేంద్రియాలు నన్ను మళ్ళీ నా వైపు

 

అడుగులేయించడానికి యత్నిస్తూనే ఉంటాయి

 

ఒకప్పటి జ్ఞాపకాల సాగర అల

 

అప్పుడప్పుడూ లేస్తూ నా నన్ను జ్ఞప్తికి చేయచూస్తోంది

 

 

 

 

 

ఒక్క క్షణం గుండె పట్టుకుని...

 

అంతర్ముఖ దృష్టికోణాన్ని కేంద్రీకరించి

 

అంతర్చక్షువులతో పరికించి చూడండి

 

ఒక్క క్షణమో...వెయ్యోవంతు కాలమో

 

ఇదే స్థితి మీ అందరిలోనూ మెదలట్లేదూ

 

 

 

అందుకే అడుగులేస్తూనే ఉందాం

 

ఇప్పుడు కాకున్నా...రేపైనా

 

మూలమాతృక స్థానాన్ని చేరేందుకని...

 

 

 

 

 

||సర్వం ప్రేమమయం||

ఎక్కడ కనిపించట్లేదు ప్రేమలాలిత్యం
కాదేది ప్రేమకనర్హం
"
కను" తెరచి చూస్తే
నిజంగా మనని మనం తెరుచుకు చూస్తే
సర్వం...ప్రేమ మయం

పొద్దున్న పూసే గడ్డిచివురుపై
పుట్టే మంచు ముత్యం
అర్రులు చాచట్లేదూ మన లాలిత్యం కోసం

భూమితల్లిని కిరణాలతో ముద్దాడుతూ
పొద్దుటే వెలుతురు నిధిని మోసుకొచ్చే
సూరీడు ఉవ్విళ్ళూరట్లేదూ
మన ఆత్మీయ దృష్టి ఆలింగనం కోసం

దారిలో తడబడుతున్న బుజ్జి కుక్కపిల్లని
సురక్షిత హస్తాలతో తల్లి కడకి చేర్చినప్పుడు
దాని కళ్ళు వెతకట్లేదూ మరల మరల
నీ కరుణపూరిత స్పర్శ కోసం

మిట్టమధ్యాహ్న వేళ
నువ్వు నాలుగే ముద్దల బువ్వ పెట్టినా
అడుక్కోడానికొచ్చిన ముసలి అవ్వ
మనసు కూడగట్టుకోవట్లేదూ
నువ్వు చల్లగా ఉండాలన్న ఆశీర్వచనం కోసం

సాయంకాలం వేళ
ఏ ఆహారం దొరక్క ఇంటివెనొక్కొచ్చి
అరిచే పిల్లికి పాలు పోసినప్పుడు
అది ఆరాటపడట్లేదూ
నిన్ను తనివితీరా రాసుకుపూసుకు తిరుగుతూ
దాని విశ్వాసాన్ని వ్యక్తం చేయడం కోసం

మనకడ్డొస్తోందని
ఏపుగా పెరిగిన చెట్టు నరికివేయబడుతున్నప్పుడు
అది తనలో తనే మౌనంగా రోదించట్లేదూ
నువ్వు మళ్ళీ అదే పని
ఇంకెప్పుడూ చేయవన్న వాగ్దానం కోసం

అందుకే నేనంటాను
కను తెరిచి చూస్తే
మనమవుతావం సిధ్ధం
ప్రాణికోటి సర్వాన్ని
ప్రేమించేందు  కోసం... 23NOV12

 

 

 

 

 

 

 

 

 

||మంట||

కాలేదుకేగా పుట్టాం
ఇంకా ఇంకో ఆలోచనెందుకు
పూర్తిగా కాలుదాం
ఒక ఘడియ అటో ఇటో

చితిలో కాలే బదులు
సూడో భావాగ్నిలోనో
బతుకు చివర కాలే లోపు
మొహానికేసుకునే ముసుగు మంటల్లోనో

ఈలోగా అసలు తపనే వద్దు
తొందరపడి ఆర్పే ప్రయత్నాలు
అసలే వద్దు

ఏవేవో ఙ్ఞాన అలలుంటాయి
వాటి తడితో నిప్పునార్పి
నిన్ను ముద్ద చేసి
నిన్ను నిన్నుగా అందించేందుకు
వాటి వైపు వద్దే వద్దు

సత్య మేఘాలు
అమృతం కురిపిస్తుంటాయి
వాటిలో తడిపి
అమరులని చేసేందుకు
అటువైపు అడుగు ఒక్కటి కూడా వద్దు

కాలడం మన జన్మ హక్కు
మనిషిగా పుట్టి
మనిషిగా సాధించుకున్న హక్కు

అందుకే...
కాలుదాం...
ముమ్మాటికీ పూర్తిగా కాలుదాం! 01.11.2012

 

||నేను కవిని||

నే రాస్తున్నాను
రాసేస్తూనే ఉన్నాను
కవినై చెయ్యాల్సిన పని కూడా
అదే కదా...
అందుకే రాసేస్తున్నాను

వీధిలో అనాధపిల్లెవరో
అడుకోవడానికొచ్చింది
పొద్దుటే రాయాలని కూర్చుంటే
నాకీ సోదేమిటి
ఫొమ్మని కసరడానిక్కూడా
తీరిక లేనివాడిని
అరిచి అరిచి అదే పోతుందిలే

కార్లో పోతూ కవితలల్లుకుంటుంటే
ఎవడికో ఏదో ప్రమాదం జరిగితే
నన్నాపి సాయం చెయ్యమని
ప్రాధేయ పడినప్పుడు
కోపం సాంతం నిగ్రహించా...
ఏదైనా కవినికదా
ఎందుకంటే
నేనప్పుడల్లేది
మారాల్సిన వ్యవస్థపై విప్లవ కవిత

రోడ్డుపై సరుకులు కొనేప్పుడు
ఎంత జాగ్రత్తవసరమంటారు
ఒక్క రూపాయి కూడా
ఎక్కువివ్వకూడదు వీళ్ళకి

ఇంతకీ ఏం చెప్తున్నాను...
అదే అదే
కవిని కదా
కవితలే రాయాలి కదా

ఒక్కో సారి మదిలో ఎక్కడో
ఓ మూల
ఒక ప్రశ్నొచ్చింది
గాంధీ, థెరెసా...వీళ్ళందరూ
ఏ కలం వాడారని
ఒద్దొద్దు నాకెందుకు
నేను కవిని కదా

ఏం జరిగినా, ఎవరేమనుకున్నా
నా కలానికి నే చెప్తూనే ఉన్నా
ఆగకుండా రాసుకు పొమ్మని
పోయేదేంలేదనీ
మహా అయితే
నాల్గయిదు సిరా చుక్కలేననీ! 20.10.12

 

 

 

 

 

||ప్రేమకాంత||

కెరటాలావలి నుండి పైకొచ్చే
తాజాదనపు సూరీడు
ఆమె ఫాలసముద్రంలో ఉదయించే
చిక్కటి సింధూర చుక్కలా అగుపించట్లేదూ

దూదిపింజెల్లా తేలిపోతున్న
మేఘాల ఒరవడి గమనిస్తే
ఆమె కన్నుల్లో తేలియాడే
మన ప్రతిబింబాల స్ఫురణ కలగట్లేదూ

బారులు తీరి సందడిగా ఎగిరే
పక్షుల గుంపుల తీరు
ఆమెకు తీరికలేకుండుండి సరిచేసుకోలేని
ముంగురుల వరుస గుర్తుచేయట్లేదూ

అందమైన ఒంపులు తిరిగి
వయ్యారంగా సంద్రంలో కలిసే నది చూస్తే
పచ్చటి పంట పావడాపై అలవోకగా వదిలేసిన
ఆమె ఓణీలా అనిపించట్లేదూ

సూర్యకాంతి ప్రతిఫలించే
ఇసుకతిన్నెల తీరం చూస్తే
మన మనసే ప్రతిఫలించే
నున్నని ఆమె నడుమును తలపించట్లేదూ

ఆమె వర్ణం సప్తవర్ణాల కలగలుపు
ఆమె మనసు అందరి బధ్ధక మనసులకు మేల్కొలుపు

చటుక్కున చూసిన
ఆమెతో మమేకమై గమనించినా
ఎవడండీ ప్రేమలో పడనిది ఆమెతో
అనుక్షణం రమించాలనే
హృదయం లేనివాడెవడండీ ఆ ప్రకృతికాంతతో! 18.10.2012

 

 

 

 

 

||ప్రణయ కావ్యం||

తన తేనెమీగడ చిర్నవ్వుతో మొదలు
తన తనువు విరివిల్లు చేసి
మోహబాణం ఎక్కుపెట్టగా
నేనేం ప్రవరాఖ్యుడినా
వశంతప్పక నిల్చుని ఉండడానికి

నాలో ఆవేశం ఎంత గప్పున పైకి లేచిందో
అంతకు ఎన్నో రెట్లు నెమ్మదిగా
అనాచ్ఛాదన సమయం గడిచింది
ఆ తృప్తికూడా మేమనుభవిస్తూ

ఆమె ఆవేశానికి నే లొంగానో
నాకు విలువనిస్తూ ఆమే ఒరిగిందో
మొత్తానికి ఒత్తిళ్ళతో పానుపు పులకరించింది

ఎన్నెన్ని అద్భుతాలు...
ఎన్నెన్ని నమ్మలేని వింతలు
ఆమె శరీరపుఖని నేతవ్వడంలో
ఒక్కొక్కటిగా...
దేనికదే శిఖరమంత విలువకు తార్కాణాలుగా
ఆ నిధి మొత్తం ఇవాళే నా సొంతం చేస్తున్నట్టు
ఆమె చేష్టలు...ఉచ్ఛ్వాస నిశ్వాసాల తోడుగా

ఎద ఝల్లుమనిపించే పూర్ణ కుంభాలు
మనసే మునకలేసే లోతులు
చూపు తిప్పితే వెనక్కు రాలేని ఒంపులు
ప్రకృతే పరవశించే అందాలకు నిర్వచనాల్ని
నే కించిత్ విడువకుండా జుర్రుతూ

ఆమేం తక్కువ కాదుగా
నే మొత్తం నిశ్శబ్ధమయిపోయేట్టు
మనసు లోతుల్నున్న కోరికలన్నీ
అట్టడుగు నుండి తోడేస్తున్నట్టు
సమయం విలువ తెలియకుండా విజృంభిస్తూ

మా క్రీడకు చందమామ కూడా
ఆవేశపూరితుడై
తారల్ని వెతుక్కుంటూ
మేఘాల చాటుకెళ్ళిన సమయాన

పరిసమాప్తి సూచనగా
నా దేహం వర్షమయ్యింది
ఆమెలో నన్ను చిత్రిస్తూ
ఆమె అవలోకానంద తారా స్థాయిని
అనుభవిస్తుండగా...

ఆ తర్వాత పూర్తి నిశ్శబ్ధం
మా శరీరాలు అలసి సొలసినా కానీ
మనసులు మాత్రం
ఎన్నెన్ని ముచ్చట్లు చెప్పుకున్నాయని
ప్రణయ కలహ వేడుక గూర్చి
రేయి మొత్తం పులకరిస్తూనే ఉన్నాయి!

 

 

 

 

 

 

 

||నేనెవరు||

రోజూలాగే తెల్లారింది
కుళ్ళు చెత్తలోంచి లేచా
స్వార్థం కళ్ళని చికిలించి చూసా
ఇంకా మొదలు కాలేదని బైటకొచ్చా

ఒక అవకాశం విస్తరి వచ్చిపడింది
దానితో పాటే
లెక్కలేన్నన్ని నాలాంటివాళ్ళు కూడా
ఒక్క ఉదుటున శక్తినంతా కూడగట్టుకున్నా
ద్వేషం విషాన్ని కక్కా
సగం మంది మాయం

దక్కితే నాకే దక్కాలని
సూదంటు మాటల కొరల్తో కరిచి పారేసా
మిగిలిన మంది మాయం
స్నేహాభిమానాల రక్తం నాకంటుకుంది
అరారా తినేసా
రక్తాన్ని కూడా నాకేస్తూ
తిన్న తృప్తికన్నా రక్తం రుచి బాగుందిగా

దూరం నుండి అహం బురద చూసా
దొర్లి దొర్లి నిదరోయా
ఇంకా సంతృప్తి

మళ్ళీ లేచా రోజూలగే
అవకాసం విస్తరి కోసం
అనుకున్నదే తడవు వచ్చి పడితే
అదే అదనుగా పరిగెత్తబోతుంటే

నాలంటిది అడ్డుపడింది
కాస్త భిన్నంగా ఉన్నది
గట్టిగా అరుస్తున్నది
మనమూ మనుషులమేనని
నాకు పొరలి పొరలి నవ్వొస్తున్నది
నేనూ మనిషినట..హహహహ
నేను కూడా మనిషినట !! 13.10.2012

 

 

 

 

 

||శివం అవతారం||

తలపై గంగమ్ముండడం
నిత్య నిరంతర
క్షాళన కానివ్వడం

జటా జూటంలో చంద్రం
అందవిహీనత ఉన్నా
చంద్రం వంటి చల్లను మనసు కలిగుండమని అర్థం

నుదుటిన విభూది తత్త్వం
అక్కడంతా ఖాళీయేనని
నచ్చింది రాసుకొమ్మని చెప్పడం

మూడో కన్ను తెరిస్తే భస్మం
నీ ఙ్ఞాననేత్ర తాకిడికి
అఙ్ఞానం కాలి బూడిదవ్వాలని వివరించడం

కంఠాన సర్పం
విషం చిమ్మే ప్రాణైనా
ప్రేమకు తలొగ్గుతుందనడానికి తార్కాణం

కరి చర్మ కవచం
అహం మదం నియంత్రణలో
ఉందనడానికి నిదర్శనం

వ్యాఘ్ర చర్మాసనం
బుధ్ధి పంజాకు
అంతా దాసోహమని చూపడం

చేతిన త్రిశూలం
త్రిగుణాతీతతత్త్వ
నియంత్రణ ఆధిపత్యం

ధవళ శరీరవర్ణం
బాహ్యాంతర
స్వచ్ఛతకు నిదర్శనం

ఇదే ఇదే
ఆ శివమూర్తి అవతార తత్త్వానికి
నా భావజాల పదావిష్కారం 09.10.2012

 

 

 

 

 

||నా జీవితం||

పొద్దుటే అందర్నీ పలకరించి
తానంత సౌందర్యరాసి లేదని మురుస్తూ
ప్రత్యక్షభగవానుడి కిరణ తాకిడికి
క్షణికంలొ కరిగిపోయే మంచు ముత్యంలాంటి నా అనుభవం

పదహారేళ్ళ పడుచు ప్రాయంలో
తలెత్తే కోర్కెను బలంగా అణుస్తూ
ఎటూ పాలుపోక మంత్రముగ్ధలా
నొక్కిపెట్టి కూర్చున్న నా మది

కాస్త వదిల్తే చాలు
అంతరిక్ష అంచులను ముద్దాడి
అనుభవాలను పంచుతానని
ఉవ్విళ్ళూరుతున్న నా ఆరంభ ఆవేశం

తెలియాల్సిందేముంది
ఒయాసిస్సు నీళ్ళు చాలు
ఎడారినంతటినీ పచ్చతోరణం చేసేస్తానని
ఎప్పుడూ బీరాలు పలికే అనంతమనుకుంటున్న నా ఙ్ఞానం

ఇంకనేర్చింది చాలు
కాస్త వైరాగ్య మార్గం పడదామనుకుంటూ
మదిని గుణాతీతం కాక
శూన్యహితం కావించే నా అఙ్ఞానతత్త్వం

ఇవన్నీ కలిసి మెలిసి
సుడిబయట పడదామనుకుంటూ
తన్ని బయటకు రాలేక..లోన ఊపిరి సలపక
అచ్చటే తిరుగాడుతున్న..పూర్తి వ్యర్థమైన నా జీవితం! 07.10.2012

 

 

 

 

 

||శిధిల యానం||

అంతా శిధిలమవుతూ ఉంది
అంటే ఒక్కటి మాత్రం నిజం
ఎదుగుదల మాత్రం ఆగిందని

ఎంత కాలం అయ్యిందో ఎదగడం మొదలెట్టి
ఎప్పుడొచ్చానో కళ్ళు తెరిచి చూడ్డం మొదలెట్టి
ఇంత వేగిరం తరగడం మొదలయ్యింది

ఎదుగుదలలోఎన్నెన్ని హెచ్చుతగ్గులో
ఎన్నెన్ని అధోగతులో
అన్నీ ఎదుగుదలకొరకే

పల్లాలున్నాయి, ఎత్తులున్నాయి
ఏవైనా త్వరిత గతిన
శిఖరారోహణ పూర్తి చేసేందుకే

యుగయుగాలుగా మనిషిగా ఎదిగి
ద్వాపరయుగంలో అనుకుంటా తారాస్థాయికి చేరి
ఇప్పుడిలా శిధిలమవ్వడం మొదలెట్టా

శిధిలమవ్వడం కూడా ఆ దారేనా
తరుగుదల పూర్ణ శూన్యానికి చేరేందుకేనా
అర్థం కానివిషయంగా మిగిలుంది

ముందుకెళ్తున్నానో కాదో అర్థమయ్యేలోపు
ఆలోచన సందుల్లోంచి కాలం జారిపోతూనే ఉంది
అంతా గమ్యం లేని పరుగులా మిగుల్తూనే ఉంది!06.10.2012

 

 

 

 

 

||వారి మార్గం మన యత్నం||

ఓ పక్క వారు చూపిన మార్గాలు
అనుమానపు పిచ్చిచెట్లు మొలిచి
అయ్యేటట్టున్నాయి కనుమరుగులు

మరో పక్క
మనం కాలం డబ్బులెట్టి
సుఖం కార్ల ప్రయాణం కోసం వేసుకున్న
రోడ్లపై అజ్ఞానపు తారు మెరుపులు

వారు నడిచి,
కనిపెట్టి, స్వయంగా ఏర్పరిచిన
త్రోవల స్థితికి వారి ఆత్మల ఘోషలు

ఒక ఆది శంకరుడు, ఒక రామానుజుడు,
ఒక రామకృష్ణుడు, ఒక వివేకానందుడు
ఒక అరవిందుడు, ఒక రమణుడు
ఒక యోగానందుడు, ఒక లాహిరీ మహాశయుడు
ఇలా ఇంకెందరో..

మనం నడవద్దు సరే
కనీసం చెయ్యలేమా
మనం వాటిని తర్వాత తరానికి
అలాగే అందించే మన తరఫు ప్రయత్నాలు

వారి ఆత్మలు పూర్తిగా నమ్మకమొదిలి
సుదూర తీరాలకు అయ్యేలోపు పయనాలు
మీ కోసం మేమున్నామంటూ
వారి కళ్ళలో తిరిగి కురిపించాలేమా మెరుపులు 30SEP12

 

 

 

 

 

||నన్మనసు||

భావాల పేరుతో రకరకాల ఆలోచనలు చేసిన
ఙ్ఞాపకాల రక్తమింకా ఓడుతూనే ఉంది
మనసు మదిపై లెక్కలేనన్ని ఎన్నెన్నో గాయాలు
...
జన్మ జన్మల నుంచీ..మరెన్నో జన్మల వరకూ

కసుక్కున లోతుగా గుచ్చబడినవి కొన్ని
చల్లచల్లటి మాటలతో కోయబడినవి కొన్ని
ఙ్ఞాపకం స్రవించేవరకూ తెలియలేనివి కొన్ని
ఎవరికోసమో మనం చేసుకున్నవి కొన్ని

ఏదేమైతేనేం గాయాలు మాత్రం తప్పనివి
గాయాల్లేని జీవితాలే వ్యర్థమని ఆలోచనలు వేళ్ళూనుకున్నవి
జీవితప్రవాహంలో మనతో పాటూ
కొట్టుకొచ్చేస్తున్నవి ఆ గాయాలు అన్నీ

ఒక్కసారి మనసొదిలి చూడు
జీవితమంతే వెలుగేనని
అంతఃకరణ చెప్పే మాటల్ని పెడచెవినపెట్టి
మనసును విడదీయలేనంతగా పేనవేసేస్కుని
యుగాలకు యుగాలు గడిపేస్తూ
మళ్ళీ మళ్ళీ పుట్టేస్తూ
తిరిగి పుట్టడం కోసమే మళ్ళీ మళ్ళీ ఛస్తూ
ఎవరో వచ్చి చక్రభ్రమణం ఆపుతారని
వెర్రిమొర్రి చూపులు చూసేస్తూ
జీవితాలు కదుల్తున్నాయి
కదలడం కోసమే మెదుల్తున్నాయి!! 29-09-2012

 

 

 

||షటేంద్రియ బలిదానం||

ఆ ముళ్ళు మన జీవితంలో నిత్యాంతర్భాగం
మన మనః సంస్కారాల ఏర్పాటుకు..అవే మూలకారణం
జీవితాల తరబడి..
అవి ఒక్కోటీ అయ్యాయి ఒక్కొక్క ఇంద్రియం
వాటిని ముళ్ళని మరచి
ఇంద్రియాలుగా ఆపాదించేసుకొని
మనః స్ఫూర్తిగా ఆ బాధే సుఖమనుకొని
సంపూర్ణంగా ఆనందిస్తున్నాం

మనకున్నాయి ఒక్కో ఇంద్రియాన్ని
తెగనరికేందుకు ఒక్కో పరికరం

కామం ఇంద్రియాన్ని
వైరాగ్య ఖడ్గంతో బలిద్దాం

క్రోధ ఇంద్రియాన్ని
క్షమతో నరుకుదాం

లోభ ఇంద్రియానికుంది
శరణాగతి యోగం

మోహ ఇంద్రియానికి
పూర్ణ వ్యామోహ పరికరం

మద ఇంద్రియం
నాదేం లేదన్న ఆలోచనకు వశం

మాత్సర్య ఇంద్రియాన్ని పీకేందుకు
ఉపయోగిద్దాం శూన్య భావం

మనకు తెలుసు
ఇంద్రియ నరికివేత అత్యంత బాధాకరం
అందులోనూ వాటితో మనది
జన్మజన్మల అనుబంధం

నరికివేత గాయాలకు
కాలం, ఉదాసీనత లేపనాలు పూద్దాం
త్వరలో గాయాల గుర్తులు కూడా మాయం
తప్పక అవుతుందిగా
సంపూర్ణ స్వచ్ఛ చైతన్య ఆవిర్భావం!! 27SEP12

 

 

 

 

 

||ప్రేమవతారుడు||

మొదటిసారి అతడి రక్తం చిందించబడింది
అతడికి ముళ్ళకిరీటం అలంకరించబడ్డప్పుడు

అతడు శిలువను మోసాడు
దానితోటే అందరి పాపాలను మోస్తున్నానని భావించాడు
ఆ బరువుతో శరీరమొంగినా..
తనలో కరుణ మాత్రం నిఠారుగా ఉందని చాటాడు

అతడి రక్తం స్రవించి ఇంకుతూనే ఉంది
వంటిపై కొరడా పేల్తున్నప్పుడూ
శిలువకు మేకులు మోదుతున్నప్పుడూ

రక్తమింకిన ప్రతిసారీ..
అతడి ప్రేమద్విగుణీకృతమయ్యిందనుకున్నాడు
అతడు నోరు తెరిచి అడగడడమే తరువాయి..
దైవం తరఫు లక్షల సైనికులు
అతడి పక్షాన నిలబడే అవకాశముండీ
ప్రేమించే బలహీనత వల్ల
అతడు మిన్నకున్నాడు

సరిగ్గా మూడ్రోజుల తర్వాత
అతడు పునరుజ్జీవితుడయ్యాడు
కానీ..
ఇంకా భూమిపై ఎన్నో
సంపూర్ణ ప్రేమోద్భవ హృదయగర్భాల ద్వారా
అతడు నిత్యం
పునరుజ్జీవితుడవుతూనే ఉన్నాడు!! 25SEP12

 

 

 

 

 

||ఎక్సెంట్రిక్ ఫెలో||

ఇతడు ఖచ్చితంగా..మూర్ఖుడో..పిచ్చివాడో
ఏదేమైతేనేం తప్పనిసరిగా
మట్టుబెట్టి సమాధి చెయ్యాల్సినోడు

లేకుంటే..
దేవుడికి ప్రతిరూపం మనిషంటాడు
దేవుడొక్కడేననీ..ఎక్కడోలేడనీ
సరిగ్గా వెతికితే నువ్వే దేవుడంటాడు
హుండీల ఆదాయం కొల్లగొట్ట చూస్తున్నాడు

ప్రతి బంధం వెనుక స్వార్థమే ఉందనీ
ప్రేమిస్తే అది మటూమాయమంటాడు
ఇచ్చిపుచ్చుకోవడాలొద్దంటాడు
ప్రేమ పేరిట వ్యాపారాలన్నీ మూతబడ చూస్తున్నాడు

పగ ప్రతీకార జ్వాలల్ని
క్షమా వర్షంతో ఆర్పొచ్చంటాడు
కోట్ల విలువైన ఆయుధ సంపత్తికి చెదపట్టించేట్టున్నాడు
మానవులంతా ఒకటయ్యే విపత్తు తెచ్చిపెట్టేట్టున్నాడు

ప్రపంచం అంతా వెతికితే లోనే ఉందంటాడు
విద్యకు మూలం స్వీయశోధనంటాడు
కళాశాల వ్యాపారాల్లో పెట్టుబడులన్నీ
మునిగిపో చూస్తున్నాడు

ఙ్ఞానమైనా సత్యమైనా
నీలోనే కనుక్కునే ప్రయత్నం చెయ్యమంటాడు
గురువైనా స్వామైనా నువ్వేనంటాడు
భక్తజనకోటి ఆదర్శాలను కాలరాయ చూస్తున్నాడు

ఏమాత్రంమన్నించాల్సినోడు కాడు
ప్రపంచం చివరివరకూ తరిమి తరిమి కొట్టాల్సినోడు!! 24SEP12

 

 

 

 

 

 

 

||మతమా మార్గమా||

వారెవ్వరూ లేరు
వారు వివరించిన ధర్మ మార్గాలు మిగిలున్నాయి
అదొక మార్గమేనని చెప్పిన వ్యాఖ్యలున్నాయి

అతడు లేడు
అతడు చెప్పిన ప్రేమ, పరిశుద్ధత దార్లున్నాయి
అవి దార్లేనని రాసుకున్న మాటలున్నాయి

అతడు లేడు
అతడు బోధించిన జ్ఞానం, బుద్ధం మిగిలున్నాయి
అవి కూడా అటే చేరుస్తాయని చెప్పిన మాటలున్నాయి

అతడు లేడు
అతడు నిరూపించిన కరుణ, శాంతి కూడా ఉన్నాయి
వాటితో నువ్వు చేరేదక్కడికేనని రాతలున్నాయి

అతడు లేడు
అతడు పాటించిన సత్యం, వైరాగ్యం త్రోవలున్నాయి
ఆ త్రోవల్లో నీ గమ్యం అదేనని బోధనలున్నాయి

మనిషి దేవుడి సృష్టి
మార్గాలు, త్రోవలు, దారులు వారి దృష్టి
మతం మాత్రం మన సృష్టి
మన మతమేదంటే మానవమతమని బల్లగుద్ది చెప్దాం
ప్రాంత దేశ పరిమితులు కూడా దాటి
ఏదైనా చేరేది ఒక్కటేనని నిరూపిద్దాం! 23 SEP 12

 

 

 

 

 

||పయనసూత్రాలు||

భద్రం కొడకో
చెప్పిందంతా ఓ మారు గుర్తుకు తెచ్చుకోరోయ్

...
పయనంలో అగాధాలుంటాయి
చిన్న తీపి అలవాట్ల వల విసిరి
లోనకు లాక్కో చూస్తాయి
నువ్ మాత్రం లోనపడమాకు
సంకల్పపిక్కబలంతో ఆవలికి గెంతెయ్

పయనంలో పర్వతాలుంటాయి
మాటల బండలపై నిన్ను
సర్రున జార్చేయ చూస్తాయి
నువ్ మాత్రం జారి పడమాకు
చిర్నవ్వు తూటాలతో పిండి చేసెయ్

పయనంలో అలలుంటాయ్
ఆశల సముద్రంలోకి
గుంజుకుపో చూస్తాయ్
నువ్ మాత్రం మునిగిపోమాకు
లక్ష్యదృష్టి శక్తితో ఈదుకుంటూ పోవోయ్

పయనంలో సుడిగాలులుంటాయి
రంగుల మత్తుల కలలు జల్లి
ఎత్తుకుపోచూస్తాయి
నువ్ మాత్రం ఎగిరిపోమాకు
నీకునువ్వే దన్నుగా తట్టుకునిలబడవోయ్

భద్రం కొడకో
చెప్పిందంతా ఓ మారు గుర్తుకు తెచ్చుకోరోయ్ 22SEP12

 

 

 

||నువ్వెక్కడ||

కుక్కపిల్లకి ముద్ద విసిరి చూడు
ఎప్పటికైనా అది నీపై చూపించే
విశ్వాస ప్రేమను చూడు

గుడిలో ఏనుగుకు అరటిపండిచ్చి చూడు
అది తొండమెత్తి నిన్ను దీవించే
వాత్సల్య ప్రేమను చూడు

పిల్లిపిల్లకి పాలు పోసి చూడు
అది జీవితాంతం నిన్ను రాసుకు పూసుకు తిరిగే
ఆప్యాయత ప్రేమను చూడు

పావురానికి గింజలు విసిరి చూడు
రోజూ క్రమం తప్పక నీ దగ్గరకొచ్చే
దాని అనుబంధ ప్రేమను చూడు

గోవుకు గడ్డి పెట్టి పాలు పితికి చూడు
నువ్వు తనని పిండుతున్నా
ఆ తల్లి కళ్ళలో నిర్మ ప్రేమను చూడు

తోటి ప్రాణివైన నీపై
కనీసం వాటి జాతైనా కాని నీపై
వాటి రకరకాల ప్రేమల్ని చూడు

మరి నువ్వు పేజీల కొద్దీ రాస్తుంటావు
గంటల తరబడి ప్రసంగిస్తుంటావు
ఇందులో ఏ ప్రేమో వెతికి చూడు!! 22SEP12

 

 

 

 

 

||నిమ్న జీవి||

దాహానికరుస్తున్న పిచుక పిల్లని చూడు
పిడచకడుతున్న దాని నాలికని చూడు
నీకున్న దాహం కన్నా ఎక్కువనిపించట్లేదూ
...
ఆవురావురుమని గడ్డి తింటున్న ఆవుని చూడు
పేగుమెలిపెడుతున్న దాని ఆకలిని చూడు
పాపం దానిదీ ఆకలే అనిపించట్లేదూ

కొరడా దెబ్బ తింటున్న అశ్వాన్ని చూడు
ఛెళ్ళుమని పేలుతున్న దాని శరీరాన్ని చూడు
నీ బాధ కన్నా ఎక్కువనిపించట్లేదూ

ఆకుని నాకుతున్న శునకాన్ని చూడు
ఎవడు లాక్కుంటాడోనన్న భయాన్ని చూడు
నీకున్న భయాల కన్నా తక్కువకాదనిపించట్లేదూ

శ్రధ్ధగా కట్టిన గూడు కూలినప్పుడు
పక్షి పడే అవేదనని చూడు
దాని ముందు నీదెంతనిపించట్లేదూ

మనకన్న ఎన్నో రెట్లు ఈతి బాధలున్న
సమస్త ప్రాణి కోటి భావాల్ని చూడు
అష్టకష్టాలు పడి జీవితాన్ని లాగుతున్న
అద్భుతమైన నేర్పరితనాన్ని చూడు
దానితో పాటే అవన్నీ తోటి సహజీవాల్ని
అద్భుతంగా ప్రేమించే విధాన్ని చూడు
జీవితాన్ని, ప్రేమని రకరకాలుగా రాస్కునే నీ ముందు
అవెంతో ఎదిగిపోయినట్లనిపించట్లేదూ? 20SEP12

 

 

 

 

 

 

 

 

 

||మనవాడే||

అలా అనకండి..అతడూ మనవాడే
సరిగ్గా చూడండి..మనలోని వాడే

కాకుంటే..
మనం ఏడిస్తే అతడు నవ్వడు
మన ఏడుపు మానిపే ప్రయత్నం చేస్తాడు
అతడూ మనవాడే

కాకుంటే..
మనం నవ్వినపుడు అతడు ఏడ్వడు
మన నవ్వులో నవ్వవుతాడు
అతడూ మన వాడే

కాకుంటే..
మనం పడితే అతడు మాటల కారం జల్లడు
అతడి చేతితో ఉపశమన లేపనం పూస్తాడు
అతడూ మనవాడే

కాకుంటే
అతడు ప్రేమించమనడు
అడక్కుండానే అందరినీ ప్రేమిస్తాడు
అతడూ మనవాడే

కాకుంటే..
మనలోనే కలిసి తిరుగుతున్నాడు
అయిన విడిగా గుర్తించబడే వ్యక్తిత్వం కలవాడు
అతడూ మనవాడే

కాకుంటే..
అతడిలోనూ అతడున్నాడు
అందర్లో కూడా అతడున్నాడు
అతడూ మనవాడే

కాకుంటే..
బతకడం కోసం జీవించడు
జీవించడం కోసం బతుకుతాడు
అతడూ మనవాడే

కాకుంటే
అతడు మనిషి అంతే
అతడు మనీషి అంతే !! 20SEP12

 

 

 

 

 

||దశమ సంభవం||

ఓరీ మానవుడా
దొర్లింది చాలులే
కనుక్కున్నా అత్యంత రహస్యం
...
నీ జన్మ గురించేలే

ధర్మ సంస్థాపనార్థాయ
సంభవామి యుగే యుగే
నవ అవతారాలు ముగిసాయిగా
పదో అవతారం ఏదనేగా

కల్కి రూపం గుర్తుందిగా
ధవళ అశ్వాన్నెక్కి
కిరీటాన్ని ధరించి
ఖడ్గం చేతబూని
ధర్మ సంస్థాపనార్థం
అవతరిస్తాడని తెలుసుగా

అదే చెప్తున్నా జాగ్రత్తగా వినుకో
తెల్లని మనసు అశ్వాన్నధిరోహించి
బుధ్ధి కళ్ళెంతో పగ్గాలు వేస్తూ
వివేక కిరీటాన్ని ధరించి
ఙ్ఞాన ఖడ్గం చేతబూని
అఙ్ఞానాన్ని, అధర్మాన్ని
తెగనరికేవాడే కల్కిగా

ఇంకా నిన్ను నువ్వు గుర్తు పట్టలేదా
దశమ సంభవం నువ్వేనని తెలియలేదా
మనిషే పరిపూర్ణ కల్కి అవతారమని
నువ్వింకా గ్రహించలేదా

లే ఇంక
బురద కడుగు 17SEP12

 

 

 

 

 

||అరవై ఐదవ కళ||

నిన్న దేముడొచ్చాడు
కల్పారంభంలోకి లాక్కెళ్ళడానికి
ఎక్కడ సృష్టి ఆరంభమో
సరిగ్గా అక్కడికి..

అక్కడ అతగాడేం చేసాడో
కనులారా చూసే
భాగ్యం కల్పించాడు

ఒక బొమ్మను చేసాడు
ప్రాణం పోసాడు
తనకు సమానమైన శక్తినిచ్చాడు
అరవైనాలుగు కళల ప్రతిభనిచ్చాడు
నిజంగా తనక్కూడా తెలియని
విద్య నేర్చుకునే యుక్తినిచ్చాడు
అరవై ఐదవ కళ నేర్చే యుక్తి

తన హృదయానికత్తుకున్నాడు
తనివితీరా ముద్దాడాడు
తన కన్నా..
ఒక పాలు ఎక్కువున్నందుకు గర్వపడ్డాడు

సరిగ్గా ఈ సమయాన
నాకు స్వప్నం వదిలింది
దాంతో పాటు మత్తొదిలింది
మెలకువొచ్చింది

ఇంతకీ అతడికి ఓ పేరు కూడా పెట్టాడు
"
మనిషి" అని!
అరవై ఐదవకళకు
మనం కూడా పేరు పెట్టుకుందాం
"
జీవించడం" అని !! 16SEP12

 

 

 

 

 

||మానవుడే మహనీయుడు||

అతడికున్నది వజ్రాన్నైనా కోసే సంకల్ప శక్తి
దాసోహమన్నది విధి రాత అతడికి ఒగ్గి

అతడిమేధ కాలాన్నైనా ఎదిరించే కత్తి
వాడతాడు దాన్ని సందర్భాన్ని బట్టి

అతడికి కలదు కొండల్ని పిండి చేసే యుక్తి
అదే అతడికి రక్షణ కవచ శక్తి

అతడు చూడడు ఏ సుముహూర్తం ఎప్పటికీ
మంచనుకుంటే చేస్తాడు ఇప్పుడే ముమ్మాటికీ

సందేహాల పుట్టలో తలదూర్చడు ఎన్నటికీ
తానేది తలిస్తే దైవమదే తలుస్తాడంట ఇప్పటికీ

భూత వర్తమాన భవిష్యాలెప్పుడూ
అతడుచెప్పినట్టాడతాయంట ఏ నాటికీ

షట్చక్రమార్గం కరతలామలకమంట అతడికి
సహస్రదళం విచ్చి పరిపూర్ణమయ్యె ఈ సరికి

తెలుసా అతడెవరో మీకందరికీ
ఇవన్నీ కలవు మనలా మామూలు మనిషికి !! 12SEP12

 

 

 

 

 

 

 

||కలం ఏడ్చింది||

నన్ను నింపావు నీలంగా
నాతో నిన్ను రాసేందుకు..
మదిలో పొంగిన భావాన్ని
మెదడు నరాల్లోకి లాగి
మనసు భావాన్ని
మనుషభాషకు తర్జుమా చేసి
చెయ్యి కదిపావనుకున్నా
నా నాల్క తెల్లటి నేలపై
నీలం ముత్యాలు రాల్చింది
నీకు ఆనందం..నాకు పరమానందం
నీకు నేనుపయోగపడుతున్న విధం

నీలో ఆశచావలేదనుకున్నా
నీ తీరు మారలేదనుకున్నా
ఇంకొన్ని పొంగిన భావాలు
నానుండి జాలువారిన ముత్యాలు

నీవు నింపుతున్నావు
నేను కక్కుతున్నాను
అదే పనిగా..అదే తీరుగా
నువ్వు ఙ్ఞానివనుకున్నా
మనసులో నీకు కోటి దండాలన్నా

కాలం కదిలింది వేగంగా
నీ చెయ్యి కన్నా కొంచెం వడిగా
నాకు వీలు దొరికింది
నీ లోకం పోకడ చూసే విధంగా

నీకు తెలియలేదు కానీ
నా ఆనందం ఆవిరయ్యింది
నా మనసు బడబాగ్ని మధ్య
నేరాల్చిన అక్షరాలు నవ్వాయి
నా కన్నీళ్ళ మధ్య

నీ ప్రపంచం ఇదా?
నీ అసలు తీరిదా?

రాల్చేందుకే కానీ
అవి నీ మదినుండి కాదని
నీ చెయ్యి రాసేందుకే కానీ
చేసేందుకు కాదనీ

తనివితీరా ఏడ్వాలనుంది
మళ్ళీ కలాన్నై పుట్టరాదని
ఉరేసుకోవాలనుంది
నాతో ఓ సూడో ప్రపంచాన్ని సృష్టిస్తున్నానని!! 08SEP12

 

 

 

 

 

||పరుగు||

అతడు పరిగెడుతున్నాడు
కాళ్ళు సాగదీసి.. శక్తినంతా కూడదీసి
అదే పనిగా..ఎక్కడికో తెలుసో లేదో
...
అతడు పరిగెడుతున్నాడు
అనుభవాల్ని లెక్కించుకుంటూ
భావాల్ని ఆరబోసుకుంటూ
అంధకారమైనా తడుముకుంటూ

అతడు పరిగెడుతున్నాడు
అప్పుడప్పుడూ ఆవేశాన్ని
అక్షరాలుగా మారుస్తూ
అదే పరుగని తలుస్తూ
వళ్ళు మరచి కళ్ళు మూసి

అతడు పరిగెడుతున్నాడు
సుఖంచుక్కను చూసి
అటువైపే వెలుగనుకుంటూ
పక్కవాడు పడుతుంటే
తానుముందుకెళ్తానని ఊహిస్తూ

అతడు పరిగెడుతున్నాడు
కష్టం గోడోస్తే దూకడం మాని
తన దారిని మళ్ళిస్తూ
బతకితే ఇలాగే బతకాలని
పక్కవారికి స్ఫూర్తితో నేర్పిస్తూ

అతడు పరిగెడుతున్నాడు
జీవితం ఆఖరయ్యే సమయానికి
లెక్కేసుకున్నాడు పయనమెంతని
తెలుసుకున్నాడు ఉన్నదక్కడేనని

అతడు పరిగెడుతున్నాడు
మళ్ళీ పుట్టి..ఈసారి కొంచెం వేగంతో
కాళ్ళు సాగదీసి.. శక్తినంతా కూడదీసి
అదే పనిగా..ఎక్కడికో తెలుసో లేదో
అతడు పరిగెడుతున్నాడు 06SEP12

 

 

 

||నా పుట్టుక||

నే పుట్టాను..మనసు బండను
సంకల్ప ఉలితో సామర్థ్యంగా మలిచేందు కోసం

నే పుట్టాను..చీకట్లో వెలుగవ్వడంకోసం కాదు
బతుకు ప్రమిదలో ఆశయ దీపం ఎలా వెలుగిస్తుందో చూపడం కోసం

నే పుట్టాను..నిరాశలో ఉన్నవారిని బయటకు లాగడంకోసం కాదు
నిరాశల సోపానాలతో విజయశిఖరం వైపు అడుగేయించడంకోసం

నే పుట్టాను..ఏఢ్చేవారి కన్నీరు తుడవడం కోసం కాదు
ఏడిస్తే కళ్ళనిండా నీళ్ళతో చూపే కరువవుతుందని చెప్పడం కోసం

నే పుట్టాను..ఎందరికో మార్గం నిర్మించడం కోసం కాదు
స్వీయమార్గ నిర్మాణంలో ఉన్న తృప్తి నేర్పడంకోసం

నే పుట్టాను..నాతో కలిసి అడుగెయ్యమని చెప్పడంకోసం కాదు
నీదే మొదటి అడుగు అవ్వాలని చెప్పడం కోసం

నే పుట్టాను..ఎవ్వరినీ ఉద్ధరించడం కోసం కాదు
ఉధ్ధరించే శక్తి సామర్థ్యాలు నీకున్నాయని చాటడంకోసం

నే పుట్టాను..సాధన యఙ్ఞంలో సమిధనయ్యేందుకోసం
నే పుట్టాను..బతుకు కోయిల పాట రాగమయ్యేందుకోసం
నే పుట్టాను..అవేదనాక్షరాలను ఆచరణాలుగా మార్చేందుకోసం
నే పుట్టాను..ప్రపంచపు వెలుగుకు కిరణమయ్యేందుకోసం

 

 

 

 

 

llఅతీత నారిll

ఆమె పయనం నిరంతరపరిపూర్ణం
ఆమె అధిగమించే దూరం అనంతం
కోట్ల కొట్ల అనుభవాల ముడుతల్ని సింగారించుకుంటూ
లెక్కలేనన్ని అనుభూతుల సుడుల్ని కలిపేస్కుంటూ
రంగు రంగుల కళ్ళకు అవే రంగుల్లో కనిపిస్తూ
ఆమె మారుతోందన్న వాదనల్ని
సమయం చిర్నవ్వుల మధ్య దాచేస్తూ
అన్నవారే మారుతున్నారన్న నిజాన్ని గమనిస్తూ
తనను ముక్కలు చేసి విభజించి కొలుద్దామన్న
అలోచనలను కూడా తల్లిలా లోన దాచేసుకుంటూ
కిందా పైనున్నవారిని ఒకేలా తనతో తీస్కెళ్తూ
సాగలేని వారివైపు చిన్నచూపు చూడక
అలసినవారిని మృత్యుఒడిలో కాసేపు లాలిస్తూ
లెక్కలేనన్ని జాతుల కులాల జీవితాలకు కూడా
తనదైన శైలిలో ఒకేలా తీర్పిస్తూ
నిరంతర పరిపూర్ణం వైపు అనంతంగా పయనించే
కాలం తల్లికి జీవితాంతం వందన అభివందనం!! 26AUG12

 

 

 

 

 

||మార్పు||

 

 

 

నన్నడుగు మారటం ఎంత కష్టమో
మార్పుని స్వాగతించాల్ట
చెప్పినంత సులభమా? చేయ తరమా?
మార్పు బండి కింద
తెగిన నా అనుభవాన్నడుగు
తెగే ముందు గిలగిలా కొట్టుకోవడం చూసి
తల్లడిల్లిన నా హృదయాన్నడుగు
అప్పటీవరకూ పోగేసుకుని కూడేసుంచిన
కుప్పలా కూలిన నమ్మకాన్నడుగు
దానికింద సమాధయిన నా ఆశల నడుగు
మార్పు దెబ్బకి బద్దలైన
అప్పటిదాకా చూసిన దర్పణ్ణాన్నడుగు
విరిగిన ముక్కలు తాకి
అనుభూతుల రుధిరమోడుతూ
విలపిస్తున్న నా హృదినడుగు
మారటం ఎంత కష్టమో
అయినా నే బిగపట్టుకు మారా
నువ్వు మనసారా కోరావని
మారిన తర్వాత ఎలాగూ సర్వస్వం
నీకర్పణమేనని..నాదంటూ ఏమీ లేదని!! 24AUG12

 

 

 

 

 

||తవ్వుడు||

 

 

 

తవ్వుతున్నా..ఏదంటే అదే
వస్తున్న అయాసాన్ని
ఓర్పు వెనక్కినెట్టుతూ
కారుతున్న అనుభవాలస్వేదాన్ని
సంకల్పహస్తంతో తుడుస్తూ
...
ఙ్ఞాపకాల అంధకారంలో
పరమావధి లోచనావెలుగు తోడుగా

తవ్వుతున్నా..ఏదంటే అదే
ఎటుచూసినా కూలుతున్న
కుళ్ళు..కుతంత్రాల పెళ్ళలే
చిర్నవులపారతో పక్కకి తోస్తూ
నేనూనాదనే అహాల బండలే
లక్ష్యశోధన ఉలితో
కాలం సుత్తితో ముక్కలు చేస్తూ

తవ్వుతున్నా..ఏదంటే అదే
బొట్టుబొట్టుగా అప్పుడప్పుడూ
అంతర్చక్షువుకి కనిపిస్తుంటే
ముముక్షత్వ దాహాన్నవి తేర్చలేకుంటే
పిడచకడుతున్న మది నాలుకను
తత్త్వ నెమరువేతతో ఆపుకుంటూ

తవ్వుతున్నా..ఏదంటే అదే
ఙ్ఞానఊట ఎప్పటికైనా ఊరుతుందని.. 20AUG12

 

 

 

 

 

 

 

ఎంత కష్టం, ఎంత కష్టం

 

ఆగ్రహావేశపు దుర్గంధపు వీధుల్లో

 

కుళ్ళు కుతంత్రాల రొచ్చుల మధ్య

 

బతుకు పయనం సాగించేందుకు

 

 

 

ఎంత కష్టం, ఎంత కష్టం

 

మద మాత్సర్యాల ఉప్పనీరు నిండిన చోట

 

ప్రేమ దాహం తీర్చేందుకు

 

చుక్క అభిమానం నీరు దొరక్క

 

 

 

ఎంత కష్టం, ఎంత కష్టం

 

స్వార్థం కూడుతో బ్రేవుమని తెరుస్తున్న 

 

శిధిలావస్థ నీచపు పూటకూళ్ళ ఇళ్ళలో

 

నిస్వార్థపు పట్టెడన్నం దొరక్క

 

 

 

ఎంత కష్టం, ఎంత కష్టం

 

కామాగ్ని దహనం కావొస్తున్న

 

మనసు ఖాండవ వనం దారుల మధ్య

 

దాన్నాపే  వైరాగ్యపు వర్షపు చుక్క కోసం ఎదురు చూస్తూ

 

 

 

ఎంత కష్టం, ఎంత కష్టం

 

చిక్కటి అంధకార గతాల నడుమ

 

భవిష్యత్ వెలుగు దీపానికి

 

ధైర్యం నూనె నింపే తోడు లేక

 

 

 

అరిషడ్వర్గ కీచులాటల ధ్వనుల మధ్య

 

ప్రేమో రక్షతి రక్షితః

 

మంత్ర పఠనం కావిస్తూ

 

స్వీయ భుజస్కందాల ఊతకర్ర తోడుగా

 

 

 

ఎంత కష్టం, ఎంత కష్టం

 

మామూలు మానవుడికి  మనిషిలా బతికేందుకు!!!